మద్యం మత్తులో కొందరు ఏమి మాట్లాడుతున్నాము అన్న సోయి లేకుండా పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులను దూషించడం కనబడుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఎవరు ఏమి మాట్లాడినా వాటిని సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటంతో అవి వైరల్ అవుతున్నాయి. దీంతో నోరు జారి మాట్లాడిన వారు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఎన్ టీ ఆర్ జిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో హైవే మొబైల్ వాహనం డ్రైవర్ గా పని చేసే ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా, ప్రభుత్వంపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.

సీఎం జగన్ పై బూతులు తిట్టడంతో పాటు మూడు నెలల పాటు పోలీసులకు జీతాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన వస్తుందంటూ కూడా వ్యాఖ్యానించారు. మద్యం మత్తులో మాట్లాడాడో లేక మామూలుగా మాట్లాడాడో కానీ యూనిఫామ్ లో ఉండి మాట్లాడుతున్నాను, కావాలంటే వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్టు చేసుకో అంటూ కూడా మాట్లాడాడు వెంకటేశ్వరరావు. తన పేరు, తన ఐడీ కూడా చెబుతూ మీడియా లో ప్రచురించలేని పద ప్రయోగంలో దూషణకు దిగాడు. ఈ ఘటనపై చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో వెంకటేశ్వరరావుపై కేసు నమోదు అయినట్లు తెలుస్తొంది.
వెంకటేశ్వరరావు మాట్లాడిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన కనిపించకుండా వెళ్లిపోయాడు. అయితే పోలీసులే ఆయనను రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఎఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు మాట్లాడిన మాటలు వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులను తీవ్ర ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. త్వరలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హజరుపరిచే అవకాశం ఉందని అంటున్నారు.
Read More: భారత్ – పాక్ సరిహద్దుల మరో సారి డ్రోన్ కలకలం .. డ్రోన్ ను కూల్చివేసిన బీఎస్ఎఫ్