తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వందేభారత్ రైలును ఈ నెల 19వ తేదీన తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రారంభించేందుకు షెడ్యుల్ ఖరారు అయ్యింది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవాన్ని ఈ నెల 15వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుండి వర్చువల్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హజరు కానున్నారు.

అయితే సికింద్రాబాద్ – విశాఖ వయా విజయవాడ రూట్ లో నడిచే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం నేపథ్యంలో బుధవారం అధికారులు ట్రయిల్ రన్ నిర్వహించారు. విశాఖపట్నం చేరుకున్న ఈ రైలు పై విశాఖ కంచరపాలెం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. ఈ ఘటన దురదృష్టకరమని రైల్వే డివిజనల్ మేనేజర్ అనూప్ కుమార్ సత్పతి అన్నారు. తాము కొంత మంది అనుమానితులను గుర్తించామనీ, వారి కోసం ఆర్పీఎఫ్ గాలింపు చర్యలు చేపట్టిందన్నారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
కాగా సికింద్రాబాద్ – విశాఖపట్నం రూట్ లో ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ..వరంగల్లు, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. ఈ ట్రైన్ రాకతో సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు తగ్గిపోనున్నది.