YSRCP: జిల్లాలో పెత్తనం లేని కారణంగా అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రీసెంట్ గా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా బాలినేని బాద్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రొటోకాల్ అంశంలో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన హవా కొనసాగించుకోవాలన్న భావనలో ఉన్న బాలినేనికి హైకమాండ్ అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుండి తప్పుకుంటున్నట్లు బాలినేని పార్టీ అధిష్టానానికి తెలియజేశారు.

ఈ తరుణంలో బాలినేనికి జగన్ కబురు పంపగా, మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి సమావేశమైయ్యారు. బాలినేనికి సీఎం జగన్ కేవలం పది నిమిషాల సమయం మాత్రమే కేటాయించారని తెలుస్తొంది. ఈ సమయంలో బాలినేని ఆరోగ్యం సరిగా లేని కారణంగా రీజినల్ కో-ఆర్డినేటర్‍గా బాధ్యతలు నిర్వర్తించలేనని జగన్ కు చెప్పారుట. సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టాల్సివుందన్న రీజినల్ కోఆర్డినేటర్ గా కొనసాగలేని బాలినేని స్పష్టం చేశారుట. ఇదే సమయంలో జిల్లా పార్టీ వ్యవహారాల గురించి బాలినేని ప్రస్తావించగా, జగన్.. జిల్లా బాధ్యతలు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరికి జిల్లా బాధ్యతలు అప్పగించలేదని జగన్ గుర్తు చేస్తూ.. ఒకరి కోసం లేనివి సృష్టించలేమన్న భావన వ్యక్తపరిచారుట. రీజినల్ కో-ఆర్డినేటర్‍గా కొనసాగమని బాలినేనికి జగన్ సూచించినా తాను రీజినల్ కో-ఆర్డినేటర్‍గా కొనసాగలేనని బాలినేని చెప్పారని అంటున్నారు.
చర్చలు విఫలం..?
జగన్ తో చర్చలు విపలం కావడంతో బాలినేని తీవ్ర అసంతృప్తితో క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారని సమాచారం. జగన్ ను కలిసిన తర్వాత బాలినేని మీడియా కంట పడకుండానే వెళ్లిపోయారు. దీంతో బాలినేని – జగన్ మధ్య చర్చలు విఫలమై ఉంటాయనీ, అందుకే మీడియాతో ఏమీ మాట్లాడకుండానే బాలినేని వెళ్లిపోయు ఉంటారని భావిస్తున్నారు. ఇంతకు ముందు మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాలినేనిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటూ ఆయన వర్గీయులు ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరుణంలో జగన్మోహనరెడ్డి పిలిపించి మాట్లాడటంతో బాలినేని మెత్తబడ్డారు. మీడియా ముందుకు వచ్చీ మరీ తాను అసంతృప్తిగా ఏమీలేనని ఆనాడు చెప్పారు బాలినేని.
అయితే ఈ సారి సీఎం జగన్ తో భేటీ ముగిసిన తర్వాత బాలినేని మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడంతో చర్చలు పలప్రదం కాలేదన్న మాట వినబడుతోంది. జిల్లాలో ఎదురవుతున్న ప్రోటోకాల్ సమస్యను జగన్ దృష్టికి బాలినేని తీసుకురాగా. సీనియర్ నేతగా గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తొంది. జగన్ తో మీటింగ్ తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హైదరాబాద్ వెళ్లిబోయారు బాలినేని. బాలినేని ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుండి తప్పుకోవడం ఖాయం అవ్వడంతో త్వరలోనేకొత్త రీజినల్ కోఆర్డినేటర్ ను నియమిస్తారని తెలుస్తొంది.