Banana: ఇటీవల కాలంలో టమోటా కేజీ రూ.150 లకు పైగా ధర పలికి సామాన్యులను హడరెత్తించింది. మార్కెట్ లోకి సరఫరా పెరగడంతో క్రమంగా వాటి ధరలు దిగి వస్తున్నాయి. టమాటా ధరలు తగ్గుతున్నాయి అని ప్రజలు సంతోషిస్తున్న తరుణంలో తాజాగా అరటి పండ్లల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పది పదిహేను రోజుల క్రితం వరకూ డజను రూ.30 – 40 ల వరకూ ఉన్న వీటి ధర ఇప్పుడు ఏకంగా రూ.100లకు చేరింది. సాధారణ పండ్లు అయితే వందకు వస్తున్నాయి. మరింత పెద్దవి, నాణ్యతగా ఉన్నవి కావాలంటే రూ.120లకుపైగా చెబుతున్నారు. ఒక్క సారిగా వీటి ధరలు పెరగడంతో ప్రజలు ఖంగుతింటున్నారు.

ఈ నెలలోనే పండుగలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో వీటి ధరలు పెరిగినట్లుగా తెలుస్తొంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలను మహిళలు నిర్వహించుకుంటారు. ఇందు కోసం చాలా మంది అరటి పండ్లు కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాది డజను అరటి పండ్ల ధర రూ.80 ల వరకూ చేరగా, ఈ ఏడాది మాత్రం ఇప్పుడే రూ.100లకు చేరింది. ప్రస్తుతం అధిక శ్రావణమాసం నడుస్తుండగా, ఈ నెల 17వ తేదీ నుండి నిజ శ్రావణ మాసం ఆరంభమవుతుంది. నిజ శ్రావణ మాసంలో హిందూ మహిళలు శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలను భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటారు.
ఈ పూజలు ఆరంభం నాటికి డిమాండ్ పెరుగుదలతో అరటి పండ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా వివాహాది శుభకార్యాలకూ అరటి పండ్లను భారీగా కొనుగోలు చేస్తారు. ఈ నెల 25వ తేదీ నుండి వివాహా మూహూర్తాలు ఉన్నాయి. ఒక్కో అరటి గెల రూ.2వేలకుపైగా ధర పలుకుతోంది. ప్రస్తుతం డజను అరటి పండ్ల ధర రూ.100లు ఉండగా, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అరటి పండ్ల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతుండటం సామాన్య ప్రజానీకానికి భారంగా మారుతోంది.