మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనను ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. 25వ తేదీన వరకూ అవినాష్ రెడ్డి కూడా రోజూ విచారణకు హజరు కావాలని చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి, మరో నిందితుడు ఉదయ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వీరితో పాటు అవినాష్ రెడ్డిని విచారించాల్సి ఉందని సీబీఐ తెలిపింది. దీంతో 25వ తేదీ వరకూ అవినాష్ రెడ్డి కూడా రోజూ విచారణకు హజరు కావాలని చెప్పింది. ఆ రోజున ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది.

వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో అరెస్టు భయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి నిన్న, ఇవేళ వాదనలు విన్నారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన వివేకా కుమార్తె సునీత తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ, సునీత, అవినాష్ న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తుది తీర్పు వచ్చే వరకూ అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అవినాష్ రెడ్డికి వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదనీ, ఆయనను అరెస్టు చేయాలని సీబీఐకి అంత ఆతృత ఎందుకని ఆయన తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా హత్య జరిగిన రోజున మృతదేహం వద్దకు అవినాష్ వెళ్లే సరికి చాలా మంది ఉన్నారని చెప్పారు. సాక్ష్యాలు తారు మారు చేసే ఆలోచన లేదన్నారు. ఈ హత్యకు కుటుంబ విబేధాలు, వ్యాపార తగాదాలు, అక్రమ సంబంధాలు కావొచ్చని, రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చునని వాదనలు వినిపించారు. అవినాష్ కు మాత్రం ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు. సీబీఐ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ వివేకా హత్య వెనుక కుటుంబ, వ్యాపార విభేదాలు కారణం కాదని కోర్టుకు తెలిపారు. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదనీ, ఆయన సాక్ష్యాలు తారు మారు చేసే ప్రయత్నాలు చేశారని కోర్టుకు చెప్పారు.
అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా .. హైకోర్టులో వాడివేడిగా వాదనలు