Chandrababu:40 ఇయర్స్ ఇండస్ట్రీ, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయడం, రాత్రికి రాత్రి సెంట్రల్ జైలుకు తరలించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంతకు ముందు ఎన్నడూ ఇలా ప్రతిపక్ష నాయకుడిని అవినీతి కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించిన దాఖలు లేవు. గతంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తప్పిన సీనియర్ నాయకుడైన చంద్రబాబును అరెస్టు చేసి విధానంగా పలువురు జాతీయ స్థాయి నాయకులు తప్పుబడుతున్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. నేషనల్ మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతోంది.

ఎన్నికలు జరుగుతున్న సంవత్సరంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని అవినీతి కేసులో అరెస్టు చేయడం వల్ల దాన్ని రాజకీయంగా అధికార పక్షం ఉపయోగించుకునే అవకాశం ఉందని అనుకుంటున్నా, ఈ పరిణామంతో టీడీపీకి సానుభూతి వచ్చే అవకాశం కూడా ఉందనే వారు ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ప్రజల్లోనూ అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం దెబ్బతింటే అధికార పక్షానికి ప్రత్యామ్నాయం అవ్వాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎప్పటి నుండో ఆశ పడుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత కేంద్రంలో ఉన్న అధికార దన్నుతో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకుంది.

ఇక ఏపీలో టీడీపీ పని అయిపోయింది, అధికార వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన కూటమేనని గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసిన సోము వీర్రాజు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. టీడీపీ నుండి భారీగా చేరికలు ఉంటాయని కూడా నాడు ప్రకటించారు. కానీ ఆ తర్వాత బీజేపీలో పెద్దగా చేరికలు జరగలేదు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలియజేసిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ కూటమి నుండి పక్కకు జరిగారు. బీజేపీ స్నేహహస్తం కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయినా కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి టీడీపీకి అహ్వానం రాలేదు. రాష్ట్రంలోని అధికార వైసీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్ర పక్షంగానే వ్యవహరిస్తూ వస్తొంది. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో కేంద్ర పెద్దలు కొద్ది నెలలు దూరం పెట్టినా ఆ తర్వాత ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా సీఎం జగన్ కు అపాయింట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు.
ఇప్పుడు చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కేంద్ర పెద్దల దన్ను లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టెప్ తీసుకుని ఉండేది కాదనే మాట వినబడుతోంది. ఏపీలో బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న కమలనాధులు వైసీపీ సర్కార్ ద్వారా ప్లాన్ చేసి ఉండవచ్చనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ విచ్చిన్నం అయితే ఆ పార్టీ క్యాడర్ వారి రక్షణ కోసం బీజేపీ ని ఆశ్రయిస్తుందని తద్వారా రాష్ట్రంలో బలోపేతం అవ్వడానికి దోహదపడుతుందని కమలనాధులు భావిస్తున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు అరెస్టులో కేంద్ర పెద్దల హస్తం ఏమైనా ఉందా అంటూ కూడా మీడియా నారా లోకేష్ ను ప్రశ్నించగా, ఆ విషయం తమకు తెలియదని, బీజేపీ వారిని అడగాలన్నారు. చంద్రబాబు విజన్ ను కొద్ది నెలల క్రితం ప్రశంసించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కొద్ది నెలల క్రితం ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి చంద్రబాబుతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఇప్పుడు ఆయన అరెస్టు విషయంలో స్పందించకపోవడంతో అనుమానాలకు తావు ఇస్తొందని విశ్లేషకులు అంటున్నారు.

మరో పక్క చంద్రబాబు అరెస్టును తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఖండించినప్పటికీ టీడీపీ రాష్ట్ర బంద్ కు మద్దతు ఇవ్వకపోవడం వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల నుండి సూచనలు కారణం అయి ఉండవచ్చని అంటున్నారు. బీజేపీ జాతీయ నాయకుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు చంద్రబాబు అరెస్టు ను ఖండించినప్పటికీ ఇతర బీజేపీ పెద్దలు ఎవరూ నోరు మెదపలేదు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే చంద్రబాబు అరెస్టు వెనుక భారీ ప్రణాళిక ఉందని మాత్రం అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ ఎస్ జీ భద్రత కల్గి ఉన్న చంద్రబాబు అరెస్టు వ్యవహారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలిసి జరిగిందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.