బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఏపిలో పర్యటిస్తున్నారు. ఉదయం రేణిగుంట చేరుకున్న ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనాలు చేసి తీర్దప్రసాదాలు అందించారు. సాయంత్రం శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా .. తొమ్మిదేళ్ల మోడీ పాలనపై కీలక కామెంట్స్ చేశారు. అదే సందర్భంగా ఏపీపైనా సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాన మంత్రి మోడీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను బాధ్యతాయుత పాలిటిక్స్ వైపు మళ్లించారన్నారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు మోడీ మొగ్గు చూపారని పేర్కొన్నారు.

ఎన్డీఏ పాలనలో అన్నివర్గాల అభివృద్ధి జరుగుతోందన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని చెప్పారు. పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తొందన్నారు. మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 19వేలు ఉండేవనీ, నేడు దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రాలే కనిపించవన్నారు. 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉండేదని పేర్కొన్న ఆయన .. ఇప్పుడు ప్రతి చోట ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలో 50 కోట్ల మందికి రూ.5లక్షల చొప్పున భీమా సౌకర్యం కల్పించిన ఘనత మోడీ సర్కార్ కు దక్కుతుందన్నారు. ప్రజల చికిత్స కోసం కేంద్రం రూ.80వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఉజ్వల ఫథకం కింద రూ.9కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు.
ఇదే సమయంలో ఏపీ సర్కార్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు జేపీ నడ్డా. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని మండిపడ్డారు. ఏపిలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపి నిలిచిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలివేసిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్లే పనులు అన్నీ నిలిచిపోయాయని నడ్డా విమర్శించారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తామన్నారు. రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా వెనుకబడి ఉందనీ, తమకు అవకాశం ఇస్తే రాయలసీమను ప్రగతి పథం వైపు మళ్లిస్తామని అన్నారు.