BJP MP : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరువుకు భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు బీజెపీ ఎంపి, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య స్వామి తెలిపారు. బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సుబ్రమణ్యస్వామి..ఏపి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. సుబ్రమణ్యస్వామికి జగన్ విందుభోజనం ఏర్పాటు చేశారు.

ఆనంతరం సుబ్రమణ్య స్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తండ్రి వైఎస్ఆర్ తనకు చాలా కాలంగా తెలుసునని పేర్కొన్నారు. తాము ఇద్దరం లోక్ సభలో చాలా కాలం ఎంపీగా ఉన్నామని సుబ్రమణ్యస్వామి గుర్తు చేస్తూ జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లికి విచ్చేసినట్లు చెప్పారు.
తాను స్వతహాగా శ్రీవెంకటేశ్వరస్వామి వారి భక్తుడుగా పేర్కొన్నారు. తన తల్లి వెంకటేశ్వరస్వామిని ప్రార్థించడం వల్ల తాను జన్మించానన్నారు. శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో తరచు తిరుమల స్వామివారి దర్శనానికి వస్తుంటానని చెప్పారు. తిరుమల పవిత్రను దెబ్బతీసేలా ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడం తనకు చాలా బాధకల్గించిందన్నారు. చంద్రబాబు తమను కాపాడతారన్న భావతో ఆంధ్రజ్యోతి ఉందని సుబ్రమణ్యస్వామి విమర్శించారు. తన జీవితంలో ఇంత వరకూ పరువునష్టం దావా కేసుల్లో ఓడిపోలేదని అన్నారు.
ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని దీనిపై క్రిమినల్ కేసు కూడా దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా టీటీడీ దేవస్థానాన్ని ప్రభుత్వ ఆధిపత్యం నుండి తొలగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ లు దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. సాధువులు, స్వామిజీలే దేవాలయాల నిర్వహణ చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాను తమిళనాడులో నటరాజ స్వామి దేవస్థానాన్ని ప్రభుత్వ ఆధిపత్యం లేకుండా చేశానని సుబ్రమణ్యస్వామి గుర్తు చేశారు. చర్చిలు, మసీదులపై ప్రభుత్వానికి లేని అధికారం హిందూ ఆలయాలపై ఎందుకని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. టీటీడీ లావాదేవీలను కాగ్ ద్వారా ఆడిట్ చేయించేందుకు సీఎం జగన్ అంగీకరించారని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కేంద్ర పరిధిలోని అంశమని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం జగన్ ప్రధానికి రెండు సార్లు లేఖలు రాశారని అన్నారు. అఖిలపక్షం, కార్మిక నాయకులను తీసుకుని కలుస్తానని చెప్పారన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ప్రధానితో జగన్ చర్చలు జరుపుతారని భావిస్తున్నాన్నారు.