Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ లో 5వ తేదీ వచ్చినా ఉపాధ్యాయులకు జీతాలు అందలేదు. గురుపూజోత్సవం (టీచర్స్ డే) జరుపుకునే రోజుకు కూడా టీచర్లకు వేతనాలు అందకపోవడం పై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ డే ను ఉత్సాహంగా జరుపుకునే పరిస్థితి లేదని అంటున్నారు. 5వ తేదీ వచ్చినా ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడంపై విపక్షాల నుండి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

ఉపాధ్యాయుల వేతనాల ఆలస్యం అవ్వడంపై మంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఏయూ కన్వెన్షన్ హాలు నందు రాష్ట్ర గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి బొత్స.. టీచర్లకు ఇంకా జీతాలు వేయలేదంటూ కొందరు విమర్శిస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యం అయ్యాయని చెప్పిన మంత్రి బొత్స .. 7 లేదా 8 తేదీల్లో ఉపాధ్యాయుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని చెప్పారు.
ఇదే సందర్భంలో గత పాలకులపైనా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏన్నో ఏళ్లుగా యూనివర్శిటీల్లో నియామకాలు జరగలేదనీ, వీటిపై గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని అన్నరు. ప్రస్తుతం సీఎం జగన్ ఈ నియామకాలపై దృష్టి పెట్టారనీ, 3,200 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారని చెప్పారు. నెల రోజుల్లో అన్ని వర్శిటీల్లో నియామకాల ప్రక్రియ చేపడతామని తెలిపారు. విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో సీట్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు మంచి ఫలితాలు సాధించారన్నారు మంత్రి బొత్స. ఏపీలో తీసుకువచ్చిన విద్యా సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా చెబుతోందన్నారు. ప్రధాని మోడీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు ఏర్పాటు చేసిన ద్విభాష పాఠ్య పుస్తకాలపై ప్రశంసించారని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Roja-Rajinikanth: మిస్టర్ రజినీకాంత్.. ఒక విషయం గుర్తు పెట్టుకో, మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు