ఏపి రాజధాని అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఆరు నెలల్లోగా అభివృద్ధి పనులు చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీన చేపట్టనున్నది. ఓ పక్క రాజధాని అంశం.. సుప్రీం కోర్టు విచారణ దశలో ఉండగా, త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని అవుతోందనీ, తాను త్వరలో విశాఖకు షిప్ట్ అయి అక్కడి నుండి పాలన సాగించనున్నట్లు సీఎం జగన్మోహనరెడ్డి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నెలలోనే సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు .. పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు తమ పార్టీ, తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేస్తున్నారు.

రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదనీ, రాజధానిపై చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందనీ, న్యాయవ్యవస్థ అడ్డుకోవడం శాసనాధికారాన్ని అడ్డుకోవడమే అవుతుందని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో కేంద్రం కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అఫిడవిట్ ఇచ్చింది.

అమరావతిని ఏపి రాజధానిగా నిర్ణయిస్తూ ..2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని అఫిడవిట్ లో పేర్కొంది. దానికి అనుగుణంగా రాజధాని ప్రాదేశిక ప్రాంత చట్టం – ఏపి సీఆర్డీఏని తీసుకువచ్చినట్లు కేంద్రం తెలిపింది. విభజన చట్టంలోని సెక్షన్ 94 లో రాజధాని లో రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ తో పాటు ముఖ్యమైన పట్టణ మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాల్సి ఉండగా, ఆ మేరకు పట్టణాభివృద్ధి మంజూరు చేసిన వెయ్యి కోట్లతో కలిపి మొత్తం రూ.2500 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

2020 లో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏని రద్దు చేస్తూ కార్యనిర్వహక రాజదానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలు నిర్ణయిస్తూ ..మూడు రాజధానుల ప్రతిపాదనతో చట్టాలు చేసిందనీ, అయితే ఈ చట్టాలు చేసే ముందు తమతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదని, తమకు చెప్పలేదని సుప్రీం కోర్టు దృష్టికి కేంద్రం తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ రెండు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ నెల 23వ తేదీన సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్ అంశాలను పరిగణలోకి తీసుకోనున్నది.
