Chandra Babu: ‘చెడగొట్టకుండా ఉంటే చాలు అద్భుతరీతిలో అమరావతి అభివృద్ధి చెందుతుంది’

Share

Chandra Babu: “రాష్ట్రంలో ఎక్కడనుండి చూసినా మధ్యలో ఉండే ప్రదేశం అమరావతి, ఎక్కడి నుండైనా సులభంగా చేరుకోగలిగే ప్రాంతం, నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే, అమరావతిని చెడగొట్టకుండా, ద్వంసం చేయకుండా ఉంటే చాలు అమరావతి అద్భుత రీతిలో అభివృద్ధి చెందుతుంది” అని సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు హితవు పలికారు మహా పాదయాత్ర ముగించిన అమరావతి రైతులు తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు .. జైే అమరావతి, జైజై అమరావతి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. 45 రోజుల పాటు 450 కిలో మీటర్లు కాలినడకన రైతులు పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రలో వంద కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ రైతులు చేసిన పాపం ఏమిటి వారిపై అక్రమ కేసులు పెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. అప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించి భూములు ఇవ్వాలని రైతులను కోరితే వారు వెంటనే స్పందించారని అన్నారు. తన వద్ద నిధులు లేకపోయినా హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం ఉందని చెప్పాననీ, రైతులు ముందుకొచ్చి భూములను త్యాగం చేశారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా ఈ రోజు సభావేదికపై ఉన్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. సీపీఐ నారాయణ, రామకృష్ణ మొదటి నుండి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారని అన్నారు.

Chandra Babu: మాట తప్పారా లేదా మడమ తిప్పారా లేదా

“జగన్మోహనరెడ్డి గారూ మీరు ఎన్నికల ముందు ఏమని చెప్పారు. నాడు అసెంబ్లీలో ఏం చెప్పారు. అమరావతి రాజధానిగా పెట్టాలని మీరు చెప్పలేదా, మనకు 13 జిల్లాలే ఉన్నాయనీ, చిన్న రాష్ట్రం అయ్యిందనీ, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్డడం తనకు ఇష్టం లేదనీ, అయితే కనీసం రాజధానికి 30 వేల ఎకరాలన్నా ఉండాలని అనాడు మీరు చెప్పలేదా, అప్పుడు 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్పను అనే జగన్ రెడ్డిని ఇప్పుడు అడుగుతున్నా అమరావతిపై మాట తప్పారా లేదా మడమ తిప్పారా లేదా” అని ప్రశ్నించారు. అమరావతిపై కుల ముద్ర వేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు సభకు అన్ని పార్టీల వారు వీరంతా ఏ కులం వాళ్లు అని ప్రశ్నించారు. వీరంతా ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని అమరావతి రాజధాని కావాలని కోరుతున్నారని అన్నారు. అయిదు కోట్ల మందికి చెందిన ప్రజా రాజధాని అమరావతి. ఇది ఏ ఒక్కరిదో, జగన్ రెడ్డిదో కాదు, ప్రజలు కోరుకున్న రాజధాని అని అన్నారు. అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేశారు., ఈ మూడేళ్లలో ఒక్కసారి అయినా మునిగిపోయిందా అని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేశారు అదేమీ లేదని హైకోర్టు, సుప్రీం కోర్టులు చెప్పాయన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ధర్మపోరాటంలో గెలిచేది అమరావతి ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినదించిన చంద్రబాబు అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోనూ జరగాలి, రాజధాని మాత్రం అమరావతి మాత్రమే ఉండాలని చంద్రబాబు పునరుగ్ధాటించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటుంటే జగన్ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఎవరి దమ్ము చూసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతి రాజధానికి ఏపి బీజేపి నేతలు కూడా మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెబితే కాదనే దమ్ము జగన్మోహనరెడ్డికి ఉందా వాళ్ల మాట శిరసావహిస్తారు కాబట్టి జగన్ కు వారే చెప్పాలని అన్నారు. ఏపిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లా వంటి పలు ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయనీ, ముందు వాటిని అభివృద్ధి చేయాలని జగన్ కు సూచించారు.

ఏపి బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దోచుకునేందుకు ఏమీ లేదనే అమరావతిని వద్దంటున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో దోచుకుంటారని విశాఖ ప్రజలు వణుకుతున్నారని అన్నారు. అమరావతిలో అనేక ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. అమరావతే ఏపికి రాజధానిగా ఉంటుందని ఎంపి రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజధాని రైతులు ధైర్యంగా పోరాడాలనీ, అంతిమ విజయం రాజధాని రైతులదే అవుతుందన్నారు. సినీనటుడు శివాజీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులశిరెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, జనసేన నేత హరిప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సభా ప్రాంగణం జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో మారుమోగింది.


Share

Related posts

నియంత చర్యలు .. చట్టాలు పనిచేయవిక్కడ!! కెసిఆర్ వెనక్కు తగ్గింది ఇందుకే

Comrade CHE

Jathi Ratnalu : జాతిరత్నాలు మేకింగ్ వీడియో చూశారా?

Varun G

Nivisha New HD Stills

Gallery Desk