మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా జగన్ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. ఇంతకు ముందు ఎప్పుడూ చిరంజీవి ఏపీ సర్కార్ ను ఉద్దేశించి ఈ రకంగా వ్యాఖ్యలు చేయలేదు. మొదటి సారిగా సినీ పరిశ్రమను టార్గెట్ చేయడంపై చిరంజీవి కామెంట్స్ చేయడం అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. వాల్తేర్ వీరయ్య 200 రోజుల ఈవెంట్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ సర్కార్ పై కీలక కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ వ్యాఖ్యానించారు.
“మీ ప్రతాపం సినీ పరిశ్రమపై కాదు.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టండి. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టాలి. ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు” అంటూ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పతాకలు అందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారని చిరు అన్నారు. జగన్మోహనరెడ్డి సర్కార్ తీరు పట్ల పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన చిరు ఇప్పుడు తన మనసులోని మాటలను వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఓ పక్క జనసేన అధినేతగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పోరాటం చేస్తుంటే అటు అన్న చిరంజీవి జగన్ సర్కార్ కు మద్దతుగా మాట్లాడుతుండటం, భేటీ అవుతుండటంపై తొలుత జనసైనికులు, పవన్ అభిమానులు మండిపడ్డారు.
అయితే ఆ తర్వాత ఓ ఫంక్షన్ లో తాను తమ్ముడు పవన్ కే అండగా ఉంటానని చిరు వ్యాఖ్యానించడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే రాజ్యసభ పదవీ కాలం పూర్తి అయిన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీలకు అతీతంగానే సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై పలు సార్లు సీఎం జగన్ తో చిరు సమావేశమైయ్యారు. గతంలో సినిమా టికెట్ల వివాదంపై పెద్ద దుమారం రేగినప్పుడు కూడా చిరంజీవి ఇంతగా రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సర్కార్ పై చిరంజీవి వ్యతిరేకంగా మాట్లాడారు అంటే సినీ పరిశ్రమపై ప్రభుత్వం పెత్తనం చేయాలని చూడటమేనని టాక్ వినబడుతోంది.
దేశంలోని ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోని విధంగా వైసీపీ .. హీరోల పారితోషికం తదితర విషయాలపైనా మాట్లాడటం, ఏకంగా రాజ్యసభలోనూ ఈ అంశంపై మాట్లాడటం, ఇటీవల బ్రో మువీ విషయంలో ఏకంగా మంత్రి అంబటి రాంబాబు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్లడం తదితర విషయాలను దృష్టిలో పెట్టుకునే చిరంజీవి మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.