Punganur: చిత్తూరు జిల్లా పుంగనూరు లో పోలీసులపై దాడి కేసుకు సంబంధించి 500 మంది నిందితులను గుర్తించామని, వీళ్లలో 92 మందిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వివరాలను మీడియాకు తెలిపారు ఎస్పీ రిషాంత్ రెడ్డి. పోలీసులపై జరిగిన దాడి ప్రీ ప్లాన్డ్ అని, ఈ విషయాన్ని కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు టీడీపీ ఇన్ చార్జి చల్లా బాబు పీఏ గోవర్ధన్ రెడ్డి, డ్రైవర్ నరీన్ కుమార్ రిమాండ్ రిపోర్టులో అంగీకరించారని అన్నారు. ఈ కేసులో ఇదే కీలక అధారమని పేర్కొన్నారు.

వీడియో పుటేజీ ఆధారంగా మొత్తం 500 మంది నిందితులను గుర్తించామని తెలిపారు. 92 మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేయగా, ఇంకా 408 మందిని ట్రేస్ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నెల 1వ తేదీన పోలీసులపై దాడికి ప్లాన్ చేశారనీ, ముందుగా సమావేశం అయ్యారని తెలిపారు. అనుకున్న విధంగా 4వ తేదీ దాడి చేశారని, విధ్వంసం సృష్టించారని తెలిపారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు దక్షిణాది రాష్ట్రాల్లో లోకేషన్స్ మారుస్తున్నారని, అయినా త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. చల్లా బాబు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తే న్యాయపరంగా ఎదుర్కొంటున్నామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 4వ తేదీన ప్రాజెక్టుల సందర్శన లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా పుంగనూరులో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో దాదాపు 50 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అందులో పది మందికిపైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే పుంగనూరు ఘటన సమయంలో అక్కడ లేని టీడీపీ నేతలు, కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
యార్లగడ్డ పార్టీ వీడటంపై సజ్జల ఏమన్నారంటే..?