మార్గదర్శికి ఏపి సీఐడీ మరో సారి షాక్ ఇచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏపి వ్యాప్తంగా ఏపీ సీఐడీ తనిఖీలు చేపట్టింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు శనివారం ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ లో మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.

సీఐడీ వెంట రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలో పాల్గొన్నారు. విజయవాడ లబ్బీపేట, గుంటూరు అరండల్ పేట మార్గదర్శి మేనేజర్ ల ను సీఐడీ ప్రశ్నిస్తున్నది. మేనేజర్ ల ఇళ్లకు వెళ్లి కార్యాలయాలకు తీసుకువచ్చి రికార్డులు పరిశీలిస్తున్నది. గతంలోనూ మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సీఐడీకి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.