CJI NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్వగ్రామంలో కీలక సందేశం..! గ్రామంలో ఘనంగా పౌరసత్కారం..!!

Share

CJI NV Ramana: భారత ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో ఘనంగా పౌరసత్కారం జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తొలుత రాష్ట్రంలోకి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్ పోస్టు వద్ద జిల్లా కలెక్టర్ జే నివాస్, ఎస్పీ సిద్ధార్ద్ కౌశిక్ లు స్వాగతం పలికారు. అనంతరం పొన్నవరం గ్రామ పొలిమేర్ల నుండి గ్రామస్తులు సీజేఐ ఎన్వీ రమణ దంపతులను ఘన స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువెళ్లారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, జనసందోహం నడుమ సీఐజే ను గ్రామంలోనికి ఆహ్వానించారు. అనంతరం పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడారు.

CJI NV Ramana key speech in ponnavaram
CJI NV Ramana key speech in ponnavaram

CJI NV Ramana: ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే

మాజీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు. పొన్నవరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. పొన్నవరం, జమ్మవరం, కంచికచర్లలో తన ప్రాధమిక విద్యాభ్యాసం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తనకు చిన్నతనంలో విద్యాభోధన చేసిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ తనను ఎంతో ప్రేమగా చూసేవారని అన్నారు. చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డేనన్నారు. తనకు ఈ గ్రామస్తులు అందరూ కన్నతల్లిదండ్రుల్లాంటి వారనీ, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి గ్రామస్తుల ఆశీస్సులు కారణమన్నారు. .గ్రామం వదిలి వెళ్లి చాలా కాలం అయినప్పటికీ రూట్స్ మరిచిపోలేదని అన్నారు. తొలి నుండి తమ గ్రామం రాజకీయంగా చైతన్యవంతమైందన్నారు. ఈ గ్రామంలో ఎన్ని పార్టీలు ఉన్నా ఎప్పుడూ గొడవలు జరిగేవి కావన్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఐకమత్యమే సమాధానమన్నారు. తెలుగు వారి గొప్పతనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలని సూచించారు. తెలుగు వారి గొప్పతనం గురించి ఢిల్లీలో అనేక మంది చెబుతుంటే చాలా సంతోషం కలుగుతుందన్నారు. తమ రాష్ట్రాల్లోని ప్రముఖ కట్టడాలను తెలుగువాళ్లే నిర్మించారని చెప్తుంటారని అన్నారు. అఫ్గనీస్తాన్ పార్లమెంట్ భవనాన్ని తెలుగు వాళ్లే నిర్మించారన్నారు.

 

తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రవర్తిస్తా

కరోనా కష్టకాలంలో వాక్సిన్ ను అందించిన భారత్ బయోటెక్ యాజమాన్యం డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్రా ఎల్లా తెలుగు వారు కావడం గర్వించదగ్గ విషయమంటూ వారిని ఈ సందర్భంగా అభినందించారు. తాను తెలుగువాడిగా భారతదేశ అత్యన్నత న్యాయస్థానంలో ఉన్నానంటే ప్రజలందరి అభిమానం, ఆశీస్సులే కారణమని, దీన్ని మర్చిపోనని చెప్పారు. తెలుగు ప్రజలు గర్వపడేలా, తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రవర్తిస్తానన్నారు. దీనికి భిన్నంగా ప్రవర్తించబోనని మాటిస్తున్నానన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా స్వగ్రామానికి రావాలని గ్రామస్తులు, రాష్ట్రానికి రావాలని ప్రభుత్వం కోరిన మీదట ఈ పౌరసత్కార కార్యక్రమానికి వచ్చానన్నారు. అభిమానంతో స్వాగతం పలికిన గ్రామస్తులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులు, ప్రముఖులు, మంత్రులు జస్టిస్ ఎన్వీ రమణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రుుల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, ఎంపిలు కేశినేని నాని, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహనరావు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


Share

Related posts

రాధేశ్యామ్ లో పూజా హెగ్డే డ్యూయల్ రోల్ పై క్లారిటీ.. ఎన్ని హైలెట్స్ ఉన్నాయో చూడండి ..!

GRK

నాలుగు నెలలు ఒపిక పట్టండి: జగన్

somaraju sharma

బ్రేకింగ్ : చనిపోయిన దాసరి ఆస్తి కోసం కొట్టుకు ఛస్తున్నారు .. పోలీస్ స్టేషన్ లో రచ్చ

arun kanna