YS Jagan: ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ నిధులు విడుదల చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలోని 23,458 కుటుంబాలకురూ.161.86 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ పద్ధతిలో సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇవేళ సూళ్లూరుపేట నుండి నిర్వహించాలని ముందుగా షెడ్యూల్ ఖరారు అయ్యింది.

అయితే వర్షాల తాకిడి కారణంగా సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన రద్దు అయింది. అయితే మత్స్యకారుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చెల్లింపు ఆగిపోకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ వర్చువల్ పద్దతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇవేళ తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరపు వద్ద పులికాట్ సరస్సు ముఖ ద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నామనీ, కానీ ఈ పర్యటన వాయిదా పడినందున ఈ నెలాఖరులోనో లేకవచ్చే నెలలోనో దీన్ని చేపడతామన్నారు.
ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలకు వారి తరపున ఓఎన్జీసీతో మాట్లాడి మూడు దశల్లో రూ.323 కోట్లు నష్టపరిహారాన్ని ఇప్పటికే ఇప్పించడం జరిగిందన్నారు. ఇవేళ నాల్గవ విడత గా ఈ ఎడాది జనవరి నుండి జూన్ వరకూ ఆరు నెలలకు సంబంధించి రూ.161 కోట్లు పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందన్నారు.
ఇంతకు ముందు 2012 లో కోనసీమ జిల్లా ముమ్మడివరం లో జీఎన్పీసీ అప్పట్లో ఈ రకమైన కార్యక్రమం చేయడం వల్ల 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగిందన్నారు. వారికి రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అప్పటి నుండి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ కూడా ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో వారికి పరిహారం ఇప్పించాలని, మత్స్యకారులకు తోడుగా ఉండాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు ముందు ప్రభుత్వం అందజేసి ఆ తర్వాత కేంద్రంపై వత్తిడి తెచ్చి ఈ డబ్బు వెనక్కి ఇప్పించుకున్నామని అన్నారు. మంచి చేయాలన్న తపన ఉంటే దేవుడి సహకారం ఉంటుందన్నారు.
మత్స్యకారుల సంక్షేమం పట్ట ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో స్పందిస్తూ ముందుకు వెళుతుందన్నారు. ఇందుకు విశాఖపట్నంలో తాజాగా జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో 40 బోట్లు కాలిపోయాయని తెలియడంతో వారిని ఆదుకోవాలని తపన, తాపత్రయపడటం జరిగిందన్నారు. వాటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని విచారణ చేశామని, ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ మత్స్యకారులకు నష్టం జరగకూడదని, వాళ్లకు మేలు చేయాలని ప్రతి బోటు విలువ లెక్కగట్టమని అధికారులకు చెప్పామన్నారు. ఆ బోటుకు సంబంధించి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేలా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇవేళే చెక్కులను పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించామని చెప్పారు.
Telangana Election: బీజేపీ నేత బాబూ మోహన్ కు ‘సన్’ స్ట్రోక్