ఏపిలో మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపిలో మద్యం దుకాణాల్లో ఇప్పటి వరకూ ఆన్ లైన్ చెల్లింపులు (డిజిటల్ చెల్లింపులు) లేకపోవడంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అన్ని వ్యాపారాల్లో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న వేళ మద్యం షాపుల్లో ఆ విధానం లేకపోవడం పై విపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి. పెట్రోల్ బంక్ లు, కిరాణా దుకాణాలో సరుకులు, కూరగాయల దుకాణాల్లో, చివరకు పాన్ షాప్ ల్లోనూ ఇలా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం నగదు రహిత సేవలను పొందుతున్నారు. చాలా మంది చేతిలో రూపాయి నగదు లేకుండానే సెల్ ఫోన్ ద్వారానే డిజిటల్ పేమెంట్ తో లాదాదేవీలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపి ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించింది. రాష్ట్ర ఆబ్కారీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ ఇవేళ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. తొలి విడతగా 11 మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ లావాదేవీలు ఉంటాయని రజిత్ బార్గవ వెల్లడించారు. తదుపరి మూడు నెలల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రవేశపెడతామని చెప్పారు. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల కోసం ఎస్బీఐ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలకు అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. క్రెడిట్ కార్డు లావాదేవీలకు మాత్రం నిబంధనల ప్రకారం చార్జీలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడంపై మద్యం బాబులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆదానీ గ్రూపు షేర్ల పతనంపై ప్రముఖ రేటింగ్ ఏజన్సీల స్పందన ఇది.. ఆర్ధిక మంత్రి నిర్మల ఏమన్నారంటే..?