Earthquake: ఏపిలోని కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్క సారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు. ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భూకంపం థాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారాయి. పలు ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు నెర్రెలు ఇచ్చాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి, ఉన్నతాధికారుల రాతన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఎంత అనేది తెలియరాలేదు. ఏయే ప్రాంతాల్లో ఇళ్లు పగుళ్లు వచ్చాయి. ఎంత మేరకు నష్టం జరిగింది అనేది దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఎలాంటి ఆస్తి. ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

గత నెలలోనూ ఏపిలోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భూప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికచర్ల, చంద్లపాడు, వీరులపాడు మండలాలతో పాటు కృష్ణానదికి మరో వైపు పల్నాడు జిల్లాలోని అచ్చంపేట, మండలం మాదిపాడు, చల్లగరిక, గింజుపల్లి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. నాడు ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురి అయి ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.
టర్కీలో భూకంపం వచ్చిన తర్వాత భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఆదివారం జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతగా నమోదు అయ్యింది. ఉదయం 6.57 గంటలకు భూకంపం వచ్చినట్లుగా, అది శ్రీనగర్ కు 38 కిలో మీటర్ల దూరంలో భూమి ఉపరితలానికి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా ఎన్ సీ ఎస్ పేర్కొంది. ఈ రోజు ఉత్తరాఖండ్ లోనూ భూకంపం వచ్చింది.