ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించాలని ఏపి ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. జనవరి 21న హెచ్‌డీపీపీ కార్యనిర్వహక కమిటీ టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టినట్లు వైవీ పేర్కొన్నారు. ఈ పదవికి సంబంధించి రేపో మాపో అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉన్నది.

టీటీడీ చైర్మన్ ప్రకటన తర్వాత చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. ఆ సందర్భంలో చాగంటికి దుశ్సాలువాతో సీఎం జగన్ సత్కరించారు కూడా. అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ చాగంటి ఆ పదవిని తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చాగంటి వెల్లడించారు. అయితే అందుకు కారణాలు వెల్లడించలేదు. అయితే టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరం లేదని పేర్కొన్నారు చాగంటి.
తిరుమల వెంకటేశ్వరుడే తన ఊపిరి అని, ఆయన సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, ఇందుకు పదవులు ఏమీ అక్కరలేదని తెలిపారు. టీటీడీకి తన అవసరం ఎప్పుడొచ్చినా పరుగెత్తుకెల్లి ముందుంటానని చెబుతూ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు చాగంటి. టీటీడీలో పదవి అంటే ఎగిరి గంతేసేవారు చాలా మంది ప్రముఖులు ఉన్న ఈ తరుణంలో ఆయన ఆ పదవిని తిరస్కరించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఏపి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ నాలుగు డజన్లకు పైగా సలహాదారులు ఉండగా, ఒక్కరు ( సీనియర్ జర్నలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి) మాత్రమే ఆ పదవిని వద్దనుకున్నారు. ఇప్పుడు ఆ వరుసలో చాగంటి రెండవ వారుగా నిలిచారు.
నవీన్ హత్య కేసులో కీలక అప్ డేట్ .. ఆ అమ్మాయి ప్రమేయంపై సీపీ ఇచ్చిన క్లారిటీ ఇది