Amaravati (Guntur): గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఆర్ 5 జోన్ కు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపు ఇచ్చారు. అదే సమయంలో ఆర్ 5 జోన్ కు మద్దతుగా వైసీపీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ కి పిలుపు నిచ్చాయి. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుళ్లూరులో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు.

తుళ్లూరులో అమరావతి రైతులు దీక్షా శిబిరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకునే సమయానికి పెద్ద ఎత్తున రైతులు తుళ్లూరులో దీక్ష చేపట్టగా, పోలీసులు రైతులను అరెస్టు చేశారు. దీక్షలో కూర్చునేందుకు అక్కడికి వచ్చిన హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీమ్ భారత్ అధ్క్షుడు జడ శ్రావణ్ కుమార్ ను కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రైవేటు ప్రదేశంలో శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే అడ్డుకోవడం ఏమిటని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. దీక్షా శిబిరంలోకి ఎవరినీ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రోజు వారి నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. మరో పక్క తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
