హైదరాబాద్ నుండి పుదుచ్చేరికి బయలుదేరిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు నుండి పొగలు రావడం గమనించిన డ్రైవర్..వెంటనే ప్రయాణీకులను అప్రమత్తం చేసి దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు మంటల్లో పూర్తిగా దగ్దమయ్యింది. ప్రయాణీకులు అందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ వారి లగేజీ మొత్తం తగులబడింది. ప్రమాదానికి గురైన బస్సు మోజో ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కే బిట్రగుంట జాతీయ రహదారిపై గురువారం వేకువజాము ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సాంకేతిక సమస్య తలెత్తి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఆ సమయంలో అదే మార్గంలో వెళుతున్న ఓ వ్యక్తి బస్సు ప్రమాదాన్ని గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సీఐ రంగనాథ్, ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు. ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణీకులను ఇతర వాహనాల ద్వారా వారి గమ్యస్థానాలకు పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీ లో చేరికకు మూహూర్తం ఫిక్స్ .. ఎప్పుడంటే..?
