టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు అయ్యింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన ఘటనల నేపథ్యంలో మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కొందరు టీడీపీ కార్యకర్తలు, నాయకులుపైనా కేసులు నమోదు అయ్యాయి. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేసినట్లుగా యర్రగొండపాలెం డీఎస్పీ కిశోర్ కుమార్ మీడియాకు వెల్లడించారు. యర్రగొండపాలెం లో మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం వద్దకు చంద్రబాబు కాన్వాయ్ సమీపించిన వెంటనే కొందరు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వినట్లు సీసీ టీవీ పుటేజీల ద్వారా గుర్తించామని వారిలో ఒక బాలుడు సహా నలుగురు ఉన్నారని డీఎస్పీ చెప్పారు. రాళ్ల దాడిలో రెండు పార్టీల వారికి గాయాలు అయ్యాయని తెలిపారు.

చంద్రబాబు కాన్వాయ్ యర్రగొండపాలెం లోకి ప్రవేశించిన వెంటనే అనుమతి ఇచ్చిన ప్రదేశంలోనే సభ నిర్వహించుకోవాలని తాము పదే పదే చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అయినా అనుమతి ఇచ్చిన చోట కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రదేశంలో సభ నిర్వహించడం వల్ల కేసులు నమోదు చేశామని తెలిపారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా రాళ్లు రువ్వినవారిని గుర్తించామనీ, వాటి ఆధారంగానే కేసులు పెట్టామని డీఎస్పీ చెప్పారు. చంద్రబాబు పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం అంటూ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. చంద్రబాబు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 500 మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఆయన వివరించారు.
యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నల్లచొక్కాలు ధరించి ప్లకార్డులు, నల్లబెలూన్లు ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులు గోబ్యాక్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఎస్సీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆ సమయంలో జరిగిన రాళ్ల దాడిలో చంద్రబాబు సెక్యూరిటీలో ఉన్న ఓ ఎన్ఎస్‌జీ అధికారి ఒకరికి తలకు గాయం అయ్యింది.
Rain Alert: ఏపిలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం