రీసెంట్ గా బీజేపీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో వరుసగా ఆ పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి అదే రోజు రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు. ఏపిలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని సమాచారం. ఆ మరుసటి రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరో మంత్రి కిషణ్ రెడ్డి, బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ఇలా వరుసగా నేతలతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలోనే ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు ఆయన హుటాహుటిన ఢిల్లీకి పయనమయినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఢిల్లీలో కిరణ్ రెడ్డిని కలిశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమైయ్యారు.

ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో సమావేశం కావడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చేరిక నేపథ్యంలో సోము వీర్రాజుకు పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో బీజేపీ ఏపి రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోము వీర్రాజు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పొత్తుల అంశంపై సోము వీర్రాజుతో పార్టీ అధినాయకత్వం చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో పక్క కిరణ్ కుమార్ రెడ్డి సేవలను ఏపిలోనే కాకుండా తెలంగాణతో పాటు ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోనూ వినియోగించుకోవాలన్న యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారని సమాచారం. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఎటువంటి పదవి ఇస్తారు అనేది చర్చనీయాంశం అవుతోంది.సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఇప్పటికే పార్టీలోని కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు గా కూడా వార్తలు వచ్చారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజును తప్పించి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా..? లేక పార్టీ కేంద్ర కమిటీలో చోటు కల్పిస్తారా..? అనేది వేచి చూడాలి.

సోము వీర్రాజు అధ్యక్షుడు కాకముందు కాంగ్రెస్ పార్టీ నుండే బీజేపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించింది. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నన్నాళ్లు అధికార వైసీపీపై తీవ్రంగానే స్పందించారు. ఆ తర్వాత సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత వైసీపీపై కన్నా మాదిరిగా అంత దూకుడుగా వ్యవహరించలేదు. బీజేపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నుండి భారీగా చేరికలు ఉంటాయంటూ పలు మార్లు సోము వీర్రాజు స్టేట్ మెంట్ లు అయితే ఇచ్చారు కానీ అవి నీటి మీద రాతలే అయ్యాయి. సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ బీజేపీలో చేరలేదు. పార్టీ బలోపేతం అయిన పరిస్థితి లేదు. దానికి తోడు సోము వ్యవహార శైలి నచ్చక మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాంరాం చెప్పి టీడీపీ లో చేరిపోయారు. ఈ పరిణామాల క్రమంలో సోము వీర్రాజుకు ఢిల్లీ నుండి కబురు రావడంతో ఏమి జరగబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Read More: మోడీ నోట.. జగన్ మాట
