విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ)లకు ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్కా స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు గురువారంతో గడువు ముగిసింది. మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది. దీనిపై కార్మిక సంఘం నేత ఆయోధ్య రామ్ స్పందించారు. ఏడు విదేశీ సంస్థలు ఈవోఇ దాఖలు చేశాయని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో ఏపి, తెలంగాణ సర్కార్ లు ఆసక్తి చూపినట్లు సమాచారం లేదని తెలిపారు. ఎన్ఎండీసీ వంటి కేంద్ర సంస్థలు కూడా ఈవోఐ దాఖలు చేయలేదని అయోధ్య రామ్ పేర్కొన్నారు.

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్లాంట్ మళ్లీ గాడిన పడేందుకు నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఖర్చు చేస్తే చాలని, ఆ మొత్తాన్ని తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరిస్తామని లక్ష్మీనారాయణ ఇటీవల వెల్లడించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) సీఎండీకి లక్ష్మీనారాయణ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు తగిన విధంగా వ్యవహరిస్తామని లేఖలో పేర్కొన్నారు.
అవసరమైన నిధులను తాము ప్రజల నుండి సేకరించాలని నిర్ణయించామనీ, విరాళాల రూపంలో అందిన మొత్తాలను నేరుగా ఆర్ఐఎన్ఎల్ ఖాతాలకు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల అయోధ్య రామ మందిరం నిర్మాణానికి కూడా ప్రజల ఇలాగే విరాళాలు అందించారని చెప్పారు. ఇలాంటి ప్రజా విరాళాలను ఆర్ఐఎన్ఎల్ అంగీకరిస్తుందా అనేది తాము తెలుసుకోవాలనుకుంటున్నామని అన్నారు. దీనిపై స్పందించి సమాధానం ఇస్తే ఎంతో సంతోషిస్తామని, ఈ ప్రక్రియలో ముందుకు వెళ్లడానికి దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు,.