ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏప్రిల్ 3వ తేదీన గడపగడపకు మన ప్రభుత్వం సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకూ జరిగిన కార్యక్రమాలు, ఎమ్మెల్యేల పని తీరుపై జగన్ సమీక్షించనున్నారు. గురువారం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో అక్కడి నుండే పార్టీ కేంద్ర కార్యాలయానికి గడపగడపకు మన ప్రభుత్వం సమీక్ష నిర్వహణకు సమాచారం అందించినట్లు తెలుస్తొంది.

ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనున్నది. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పాల్పడిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధాని కేసు సుప్రీం కోర్టు ఇప్పట్లో తేలే పరిస్థితి కనబడకపోవడంతో, ఉత్తరాంధ్ర ప్రజల్లో నమ్మకం కల్గించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని అయినా విశాఖకు మార్పు చేసి అక్కడి నుంచే పరిపాలన సాగించే ఆలోచనపైనా నిర్ణయాన్ని ఆ సమీక్షా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. అలానే పార్టీ లో అసంతృప్తి వాదులపై గట్టిగానే హెచ్చరించే అవకాశం ఉంది. అదే విధంగా ఎన్నికలు ముందస్తు ఉంటాయా లేదా అనే దానిపైనా ఒక క్లారిటీ ఇచ్చి నేతలకు ఎన్నికలకు సమాయత్తం చేసేలా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకు ముందు సమావేశంలో పనితీరు బాగాలేని పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. ఆ తర్వాత వారిలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అనే విషయాలను పరిశీలించి తదనుగుణంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పటికే నియమితులైన గృహ సారధులతో నిర్వహించనున్న కార్యక్రమాలపైనా సూచనలు, సలహాలు అందిస్తారు. ఇదే క్రమంలో ఇటీవల కాలంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎంపికైన వారిలో ఒకరిద్దరికి కేబినెట్ లో చోటు లభించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి మండలిలో మార్పులు చేర్పులు ఉంటాయా లేదా అనే దానిపైనా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
మార్గదర్శి కేసులో చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ