AP High Court: ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన వివాాదాస్పద జీవో నెం.1 పై ఇవేళ హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇటీవల వెకేషన్ బెంచ్ ఇచ్చిన స్టే గడువు నేటితో ముగియగా, ఆ స్టే పొడిగింపుకు ధర్మాసనం అంగీకరించలేదు. హైకోర్టులో వాద ప్రతివాదనలు వాడివేడిగా సాగాయి. పిటిషనర్ సీపీఐ రామకృష్ణ తరపున న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ తరపున న్యాయవాదులు ఇంప్లీడ్ పిటిషన్ లు దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెకేషన్ బెంచ్ డీఫాక్టో చీఫ్ జస్టిస్ గా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించిందన్నారు. ప్రతి కేసు ముఖ్యమైనదేనని భావించుకుంటూ వెళ్తే హైకోర్టు ఏమైపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరిగితే ప్రతి వెకేషన్ జడ్జి చీఫ్ జస్టిస్ అయిపోయినట్లేనని సీజే వ్యాఖ్యానించారు. పిటిషన్ మూలాల్లోకి వెళితే అంత ఏమర్జెన్సీ కూడా అనిపించలేదన్నారు. ఈ కేసు గురించి, దాని మూలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాననీ సీజే పేర్కొన్నారు. తనకు ఏమీ తెలియదు అనుకోవద్దనీ, రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు తనకు నివేదించిందని తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన అధికారాలను పూర్తిగా వినియోగిస్తానని స్పష్టం చేసారు. తన పిటిషన్ స్వీకరించాలంటూ వెకేషన్ కోర్టు ముందు ధర్నా జరిగిందా అని ప్రశ్నించారు. అంత అర్జెంట్ గా వెకేషన్ బెంచ్ లో లంచ్ మోషన్ ఎందుకు వేశారని పిటిషనర్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఎలాంటి అత్యవసరం లేనప్పుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ప్రజల ప్రాధమిక హక్కులకు సంబంధించినదనీ, పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని న్యాయస్థానం భావించింది. అలానే నడి రోడ్డుపై మీటింగ్ పెట్టడానికి ఎవరికీ హక్కు లేదని, రహదారుల మీద కాకుండా సౌకర్యం ఉన్న చోట సభ పెట్టుకోమని చెప్పిందన్నారు. రోడ్ షాల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేదం లేదని, రహదారుల మీద భారీగా జనాలను సమీకరించి మీటింగ్ పెట్టవద్దని మాత్రమే చెప్పిందన్నారు. ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీజే గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు సభలో ఎనిమిది మంది మృతి చెందిన నేపథ్యంలో సర్కార్ ఈ జీవో తెచ్చిందని పేర్కొన్నారు. విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపున ఏజి కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ తాజా పిటిషన్లపై కూడా రేపు వాదనలు వింటామని పేర్కొంది.
రిపబ్లిక్ డే పరేడ్ లో ఏపి శకటం ‘ప్రభల తీర్ధం’ ఎంపిక .. ప్రత్యేకత ఏమిటంటే..?