రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండి టీడీపీ – జనసేన మధ్య పొత్తులపై ఊహాగానాలు వస్తు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత రెండు పర్యాయాలు ఇద్దరి భేటీలు జరగడంతో జనసేన – టీడీపీ మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్భంలో ధైర్యం ఉంటే జనసేన, టీడీపీ పార్టీలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. టీడీపీ, జనసేన కీలక నేతలు పొత్తులపై సుముఖంగా ఉన్నా ఆయా పార్టీల్లోని కొందరు మాత్రం పొత్తు లేకుండా పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఇలా రకరకాల ఊహగానాలు వస్తున్న తరుణంలో కాపు ఉద్యమ నేత, సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై విశ్లేషణ చేస్తూ ఆసక్తికరమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహనరెడ్డిని గద్దె దించాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు ముందుకు రాక తప్పదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించారు హరిరామ జోగయ్య.
లోకేష్ ను అధికారంలో భాగస్వామిని చేయాలని అన్నారు హరిరామ జోగయ్య . చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితేనే టీడీపీ – జనసేన మధ్య సయోధ్య సాద్యమవుతుందని హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. జనసేన – టీడీపీ మధ్య సయోధ్య లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలుతాయని చెప్పారు. అదే జరిగితే 2024 తర్వాత టీడీపీ అడ్రస్ రాష్ట్రంలో గల్లంతు అవుతుందని హరిరామ జోగయ్య హెచ్చరించారు. హరిరామ జోగయ్య వ్యాఖ్యలపై టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
Video Viral: వివాదంలో చిక్కుకున్న ఏపి మహిళా మంత్రి