గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం మరో సారి వార్తల్లోకి ఎక్కింది. గ్రామంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటంలో మళ్లీ కూల్చివేతల పర్వాన్ని అధికారులు ప్రారంభించారు. ఇంటి ప్లాన్ ను అతిక్రమించి గోడలు నిర్మించారని అధికారులు వాటిని కూల్చివేతలను చేపట్టారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగర పాలక సంథ అధికారులు రెండు జేసీబీల సహకారంతో కూలగొట్టారు. ప్రహరీ గోడలను కూల్చివేతలను అడ్డుకుంటూ స్థానికులు, గ్రామస్తులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ వారి నిరసనలు పట్టించుకోకుండా భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తుగానే పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీసులను భారీ మోహరించడంతో పాటు గ్రామ సరిహద్దులో పహరా పెట్టారు. గ్రామంలోకి వచ్చే వారిని తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే లోపలకు రావడానికి అనుమతులు ఇస్తున్నారు.

ఇంతకు ముందు రోడ్ల విస్తరణ పేరుతో చేపట్టిన కూల్చివేతల పర్వం వివాదాస్పదమైంది. దాంతో అప్పట్లో కూల్చివేతలను ఆపేశారు. నాడు తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టు నుండి స్టే పొందడంపై పిటిషన్ దారులకు లక్ష వంతున న్యాయస్థానం జరిమానా విధించింది. అప్పట్లో బాధిత కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి లక్ష వంతున ఆర్ధిక సాయం అందించారు. అయితే అప్పుడు కూల్చివేతల తర్వాత మిగిలిపోయిన వాటిని ఈ రోజు అధికారులు కూల్చేశారు. జనసేన ఆవిర్భావ సభకు తాము స్థలం ఏర్పాటు చేశామన్న కక్షతోనే గ్రామంలో రహదారి విస్తరణ పేరుతో కూల్చివేతలకు పూనుకున్నారంటూ గ్రామస్తులు ఆరోపించారు. అయితే అధికారులు మాత్రం రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను మాత్రం తొలగించామనీ, ముందుగానే నోటీసులు కూడా జారీ చేశామని చెబుతున్నారు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా మరో మారు రాజధానిపై స్పష్టత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్