YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి పోలీస్ శాఖ భద్రత పెంచింది. సీఎం జగన్, ఎంపి అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల నుండి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బుధవారం దస్తగిరి కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కూడా తనకు వైసీపీ వాళ్ల నుండి ముప్పు ఉందని పేర్కొన్నాడు. బుధవారం ఎస్పీని కలిసి తనను అవినాష్ రెడ్డి మనుషులు ఫాలో అవుతున్నారని పేర్కొన్నారు.

భాస్కరరెడ్డి అరెస్టు తర్వాత తన కదలికలను వారి అనుచరులు గమనిస్తున్నారని తెలిపారు. దీనిపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి భద్రత పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వన్ ప్లస్ టూ గన్ మెన్ ల భద్రత ఉండగా దాన్ని వన్ ప్లస్ 5 భద్రత పెంపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దస్తగిరి ఇంటి వద్ద 24 గంటలు తుపాకులతో పోలీసులు పహారా కాయనున్నారు. బుధవారం సాయంత్రం నుండి పోలీసులు విధుల్లోకి చేరారు. తాజా భద్రతతో మొత్తం ఆరుగురు పోలీసులు దస్తగిరికి రక్షణ కల్పించనున్నారు.