CI Swarna Latha: తప్పు చేసిన వాడు పోలీస్ అధికారిని చూస్తే భయపడతాడు. తప్పు చేసే వాళ్ల సింహ స్వప్నంగా ఉండాల్సిన పోలీసు అధికారులే తప్పుడు మార్గాలను ఎంచుకుంటే బాధితులు ఎవరి వద్ద మొరపెట్టుకోవాలి. తప్పుడు పనులు చేసే అధికారులకు కొందరు నేతలు మద్దతుగా నిలవడం అత్యంత బాధాకరం. విశాఖలో ఇటీవల రూ.2వేల నోట్ల మార్పిడి దందాలో హోంగార్డు ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం బయటకు రావడంతో ఆమె గురించి కథకథలుగా చెప్పుకుంటున్నారు. పోలీస్ అధికారుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె డబ్బులు దోచుకున్న ముఠాకు నేతృత్వం వహించి లక్షల రూపాయలు కైంకర్యం చేసిందన్న విషయం పోలీసు వర్గాలను విస్మయానికి గురి చేసింది.

మూడేళ్ల క్రితం పోలీసులపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేయగా, పోలీస్ అధికారుల సంఘం నేతగా ఆమె ఏకంగా ఎస్పీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి అయ్యన్న పాత్రుడుపై ఇష్టానుసారం మాట్లాడారు. దీంతో ఆమె ఎంతో నిజాయతీపరురాలైన అధికారిణి అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె బండారం బయటపడింది. ఇప్పుడైనా బాధితులు రిటైర్డ్ నేవల్ అధికారులు కావడం, అదీ పది లక్షలకుపైగా నష్టపోవడంతో వారు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అదీ రెండు, మూడు లక్షలు అయి ఉంటే ఈ బాధితులు కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే వాళ్లు కాదు. ఆమె బండారం వెలుగుచూసేది కాదు. ఇదే అదునుగా మరి కొన్ని నేరాలను ఆమె ఖాఖీ ముసుగులో కొనసాగిస్తూ ఉండేవారని అంటున్నారు.
ఈ వ్యవహారం బయటపడటంతో ఆమెను ఈ కేసులో నుండి బయటపడేసేందుకు ఓ అధికార పార్టీ నాయకుడు శత విధాలుగా ప్రయత్నించారనీ, అయితే మీడియాలో కథనాలు రావడం, వ్యవహారం అంతా బహిర్గతం కావడంతో అక్కడి పోలీసు అధికారులకు కేసు నమోదు చేయక తప్పలేదని అంటున్నారు. కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా కేసులో ఏ 4 గా ఆమెను చూపి అరెస్టు చేశారు. ఆమె వృత్తి పరంగా పోలీస్ అధికారిణి కాగా, ప్రవృత్తి పరంగా సినిమాల్లో నటించాలని మక్కువ పెంచుకున్నారు. సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత కొంత కాలం క్రితం ఓ పాటకు డ్యాన్స్ చేశారు. తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తాననీ, అందుకు డ్యాన్స్ లో ప్రావీణ్యం పొందాలని ఓ ప్రజా ప్రతినిధి చెప్పడంతో ప్రత్యేకంగా ఒక కొరియోగ్రాఫర్ ను నియమించుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆమె అరెస్టు అయిన తర్వాత ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీస్ శాఖ ప్రతిష్టనే మంటగలిపే విధంగా ప్రవర్తించిన ఆమెను కఠినంగా శిక్షించాలన్న మాట ప్రజల నుండి వినబడుతోంది.
PM Modi: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తాం