YS Jagan: ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ కార్యక్రమం పేరుతో జిల్లాల్లో పర్యటిస్తుండగా, ఆయన తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుండి 4వేల కిలో మీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తొంది. జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర నిర్వహణకు ‘వారాహి’ వాహనాన్ని సిద్దం చేసుకున్నారు. వైసీపీ ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తొంది. మరో పక్క సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం పేరుతో నెలలో రెండు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.

ఇక జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టడం, ఆ వెంటనే వైజాగ్ కు తన మకాం మార్చేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు. ఇప్పటికే విశాఖలో సీఎం జగన్ నివాసానికి అనుకూలమైన ప్రదేశాలను ఎంపిక చేసినట్లు తెలుస్తొంది. ఉగాది (మార్చి) నుండి విశాఖ నుండి పరిపాలన ప్రారంభించాలన్న కృత నిశ్చయంతో జగన్, ఆ పార్టీ ఉన్నట్లుగా సమాచారం. విశాఖ త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్నదనీ, తాను కూడా త్వరలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లుగా సీఎం జగన్ ఇటీవల న్యూఢిల్లీలో ప్రకటించారు. ఇక ఏప్రిల్ నుండి జనంలోకి వెళ్లేందుకు బస్సు యాత్ర ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రజలను నేరుగా కలుసుకోవడం, వారితో కలిసి పల్లె నిద్ర చేయనున్నారు జగన్.

ప్రతి మండలంలో ఒకటి రెండు పల్లెలను గుర్తించి అక్కడే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నవరత్నాల పేరుతో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను చిత్తుశుద్దితో అమలు చేస్తున్నామనీ, మరో సారి ఆశీర్వదించాలనీ జనాలను కోరనున్నారు జగన్. గతంలో పాదయాత్ర సమయంలో బస చేసినట్లుగానే బస్సు యాత్రలోనూ అదే రీతిలో ప్రజలతో జగన్ గడపనున్నారు. ఇదే క్రమంలో ప్రజల వద్దకు వెళ్లే సమయంలో అక్కడి స్థానిక సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీలోని అసంతృప్తులపైనా దృష్టి సారించనున్నారు. జగన్ బస్సు యాత్రలో అనురించాల్సిన విధి విధానాలపై అధికారులు, పార్టీ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.
బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ .. సోషల్ మీడియాలో ఆడియో వైరల్