Pawan Kalyan: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓ పక్క అధికార వైసీపీ నేతలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అంటూ కార్యక్రమం పేరుతో జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. మరో పక్క ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలతో జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇక తన పర్యటనలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ వారాహి వాహనాన్ని సిద్దం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏమిటి ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.. జనంలోకి రావడం లేదు..ఆయన వారాహి బస్సును ఎందుకు మొదలు పెట్టడం లేదు.. గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు.. అనే సందేహాలు అభిమానుల నుండి వ్యక్తం అవుతున్నాయి. జనవరి 12వ తేదీ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి మీటింగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఎక్కడా జరగలేదు. ఆ తర్వాత జనవరి చివరి వారంలో వారాహి వాహానానికి విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత నాలుగు వారాలుగా పవన్ కళ్యాణ్ జనాల్లోకి రాలేదు. గతంలో వారానికి ఒక సారి పవన్ కళ్యాణ్ జనాల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు నెలాపదిహేను రోజులు అవుతున్నా జనాల్లోకి ఎందుకు రావడం లేదు అనే డౌట్ వస్తుంది. ప్రతి నెలలో రెండు మూడు సార్లు కౌలు రైతు భరోసా యాత్ర, జనసేన జనవాణి పేరుతోనో జనాల్లో ఉండే వారు. ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టేవారు.

Pawan Kalyan: 28వ తేదీ వరకూ సభ్యత్వ నమోదు
దీనికి కారణం ఏమిటి అని ఒక సారి పరిశీలన చేస్తే … జనసేన పార్టీ ఒక అంతర్గత వ్యూహరచనలో ఉంది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు క్యాంపైన్ నడుస్తొంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా దాదాపు 25 నియోజకవర్గాల్లో వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఫోకస్ చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ వరకూ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రమాద భీమా కార్యక్రమానికి తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ఇటీవలే అందజేశారు. జనసేన ప్రణాళిక ప్రకారం సభ్యత్వ నమోదు తర్వాత మార్చి మొదటి వారంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, ఇన్ చార్జిలతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారుట. మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భావ సభను గతంలో ఇప్పటంలో నిర్వహించిన దాని కంటే భారీగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారుట. అయితే పార్టీ ఆవిర్భావ సభ వేదిక ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. కొందరైతే ఉత్తరాంధ్రలో పెడితే బాగుంటుందని సలహా ఇస్తుండగా, మరి కొంత మంది కోనసీమ ప్రాంతంలో పెట్టాలని సూచిస్తున్నారుట. ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేది వేచి చూడాలి. ఒక వైపు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. మరో పక్క పార్టీ అవిర్భావ సభ ఏర్పాట్లపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకోనున్నారు.

పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు అయిదు సినిమాలు ఉన్నాయి. రాబోయేది ఎన్నికలు సీజన్ కావడంతో ఒక సారి జనాల్లోకి వస్తే వెనక్కు (సినిమా షూటింగ్ లకు) వెళ్లడానికి కుదరదు. అందుకే ఆయన ఏప్రిల్, మే నాటికి మొత్తం తన పాత్ర షూటింగ్ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తం అయిదు సినిమాల్లో కనీసం మూడు సినిమాల్లో అయినా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే మే నెల వరకూ పవన్ కళ్యాణ్ యాత్రలకు బ్రేక్ ఇస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో వారాహి యాత్ర స్టార్ట్ అవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఇంత వరకూ దృవీకరించలేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ తర్వాతనే కొంత మంది పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలతో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించి వారాహి యాత్రకు రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తారని అంటున్నారు. మార్చి నెలాఖరు నాటికి వారాహి యాత్రపై ప్రణాళిక సిద్దం చేసుకుని ఏప్రిల్ నెల నుండి మొదలు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్యాప్ ఇవ్వడానికి కారణాలు ఇవేనని అంటున్నారు.
తప్పిన పెను ప్రమాదం .. హైదరాబాద్ – విజయవాడ హైవేపై రెండు బస్సులు దగ్ధం..ఏపిఎస్ ఆర్టీసీకి భారీ నష్టం