Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు రాజమండ్రి చేరుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్. నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని జనసేన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం పది గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం అవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిది కందుల దుర్గేష్ మీడియాకు తెలిపారు. కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించిన అనంతరం కొత్తపేట మండలం అవిడి గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధురపూడి ఎయిర్ పోర్టు నుండి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతోంది.
కడియం, కొత్తపేట, అనంతరం పి గన్నవరం మండలం రాజులపాలెంలోనూ పవన్ పర్యటన కొనసాగనుంది. సాయంత్రం తిరిగి రాజమండ్రికి చేరుకుని విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ పర్యటనలో జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొననున్నారు.