Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీఏ నుండి జనసేన బయటకు వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్డీఏలోనే జనసేన ఉందని అన్నారు. బీజేపీతో పొత్తు పోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. అయితే పొత్తులపై ఎవరికీ చెప్పాల్సిన పని లేదనీ, ప్రజలకే చెబుతామని అన్నారు. ఎక్కడ పోటీ చేయాలనేది తమ స్వీయ నిర్ణయమని స్పష్టం చేశారు.
ఎన్డీఏతో పొత్తులోనే ఉన్నామనీ, ఎన్డీఏ బేటీకి హజరయ్యామని అనారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలనీ, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా 2014 లో ఏపీలో ఉన్న పొత్తులతోనే వెళ్దామని అక్కడి నేతలకు చెప్పానని తెలిపారు. జేపీ నడ్డాకు కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పానని తెలిపారు. జీ 20 సమ్మిట్ జరుగుతున్నప్పుడు కేంద్రానికి తెలియకుండా చంద్రబాబుపై కేసులు బనాయించి జైలుకు పంపడం బాధాకరమని పవన్ అన్నారు. జైలులో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత టీడీపీకి మద్దతు తెలిపానని చెప్పారు.
ఎన్డీఏ లో ఉన్నా తమ పార్టీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని అన్నారు. జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ ఉండాలని కూడా నిర్ణయించామని తెలిపారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామో, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది వైసీపీకి అనవసరమని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన వరాలు ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ఢిల్లీకి వెళ్లి జగన్ అడగాలని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పసుపు బోర్డు కలను కేంద్ర ప్రభుత్వం సాగరం చేసిందన్నారు. సీఎం జగన్ వెళ్లినా జీడిపప్పు, కొబ్బరి బోర్డుల కోసం కృషి చేయలేదన్నారు. పొత్తులు, సీట్లపై కంటే డిళ్లీకి వెళ్లి రాష్ట్రానికి బోర్డులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సిందన్నారు. సీబీఐ కేసులు వాయిదా వేయించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు 20వ తేదీ వరకూ జీతాలు చెల్లించకపోవడం దారుణమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఐఏఎస్ లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. వేతనాలు రాక ఒప్పంద ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా ఐఏఎస్ లకు జీతాలు వస్తాయనీ, ఐఏఎస్ ల జీతాలు మళ్లించారని ఇది రాజ్యంగ ఉల్లంఘనేనన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన వైసీపీ నేతలకు సహజ గుణంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు.