Pawan Kalyan: జనసేన – టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ సర్కార్ పెంచిన మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించి మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాష్ట్రంలో మొత్తం మద్యం నిషేదం చేస్తామన్న అబద్దపు మాటలు తాను చెప్పనని అన్నారు. మహిళలు ముందుకు వచ్చి అడిగి చోట్ల మద్యం నిషేదిస్తామని చెప్పారు. సర్పంచ్ లు మద్య నిషేదం కోరితే అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
వారసత్వ రాజకీయాలతో తనకు ఇబ్బంది లేదనీ, అదే వారసత్వంతో పంచాయతీలు పెడతామంటే ఒప్పుకోనని అన్నారు. రోడ్లు వేయలేని ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఎందుకు భయపడుతోందని అన్నారు. మొత్తం 175 సీట్లు వస్తాయని వైసీపీ చెబుతోందని, అలాంటప్పుడు ఇంత భయపడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంటే ఏమిటీ , లేకపోతే మీకేమిటి అని ప్రశ్నించారు. వైసీపీ భయపడుతుంది అంటే తమకు బలం ఉందని అంగీకరించినట్లేకదా అని అన్నారు.
స్థానిక కైకలూరు ఎమ్మెల్యే, ఆయన కొడుకు పోలీస్ స్టేషన్ వేదికగా పంచాయతీలు చేస్తున్నారని, కచ్చితంగా వాళ్ల కొమ్ములు విరగ్గొడతామని అన్నారు. 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎదుర్కొని నిలబడ్డాననీ, ఓడిపోయినా హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి కచ్చితంగా వైసీపీ భవిష్యత్ తేలుస్తాయని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు తనపై దాడి చేయడానికి కార్యాలయం చుట్టూ మోహరించారనీ, ఆ సమయంలో పారిపోకుండా ఆఫీసులోనే కూర్చున్నానని అన్నారు.
కొల్లేరు ప్రజలకు టీడీపీ – జనసేన ప్రభుత్వంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ రహిత రాష్ట్రంగా భవిష్యత్తులో చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. కనీసం ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ వచ్చినా ఒరిజినల్ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. వెహికిల్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆర్సీలు ఇవ్వడం లేదన్నారు. ఆస్తి పేపర్లు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి అంట, దోచేయడానికా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. భవిష్యత్తులో మన ఆస్తుల దస్తావీజులు మన దగ్గర ఉండవనీ, అవి జగన్ దగ్గర ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్.
ఇక్కడ విదేశీ పక్షులు వలస వస్తాయినీ, ఎకో టూరిజం లా మార్చి పర్యాటక రంగంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. కనీసం కైకలూరు ను నగర పంచాయితీ కూడా చేయలేదని విమర్శించారు. దీనిని మంచి పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దాదాపు ఇక్కడ 20 గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారన్నారు. దాదాపు 66 వేల కోట్ల ఆక్వా వ్యాపారం జరుగుతోందనీ, దేశంలో 40 శాతం మన రాష్ట్రం నుండి వస్తుంది కానీ కనీసం కోల్డ్ స్టోరేజ్ లేదు, క్వాలిటీ సీడ్ ఉత్పత్తి లేదు, వారికి పూర్తి కరెంట్ లేదనీ తాము అధికారంలోకి వచ్చాక ఆక్వా సాగును లాభసాటిగా మారుస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
CM YS Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ