ఏపి రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా ఉంది. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ జనాల్లో తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీల నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం కొనసాగుతున్నాయి. ఓ పక్క ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నేతల మాటలు, ప్రసంగాలు అలానే ఉంటున్నాయి. ఈ తరుణంలో ఏపి రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ బుధవారం రాత్రి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

రాష్ట్రంలో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లు అందరికీ తెలిసిందే. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ఏపి బీజేపీ నేతలతో గ్యాప్ ఉన్నట్లుగా మాట్లాడారు. ఆ నేపథ్యంలో సోము వీర్రాజు వైఖరికి వ్యతిరేకంగా కన్నా లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నుండి పవన్ కళ్యాణ్ దూరం అయితే అందుకు సోము వీర్రాజుయే బాధ్యులు అవుతారని కన్నా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర బీజేపీలో ఏమి జరుగుతుంతో ముఖ్య నేతలకు కూడా తెలియడం లేదని అన్నారు కన్నా. సోము వీర్రాజు వైఖరిపై బాహాటంగా విమర్శలు చేయడంతో కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే కన్నా వర్గీయులు మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశారు.

గత కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి నాదెండ్ల మనోహర్ వెళ్లి సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ కలయికపై మనోహర్ వద్ద మీడియా ప్రస్తావించగా, కన్నాతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లనే కలవడం జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమనీ, మిగతా విషయాలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. మనోహర్ ఈ మాటలు అనడంతో మనోహర్ వద్ద కన్నా లక్ష్మీనారాయణ ఏమైనా ప్రతిపాదనలు పెట్టారా అనే చర్చ జరుగుతోంది. నాదెండ్ల భేటీ పై కన్నా వర్గీయులు మాత్రం ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, గుంటూరు పర్యటనకు వచ్చిన నాదెండ్ల మర్యాదపూర్వకంగా సీనియర్ నేత కావడంతో కన్నాతో సమావేశమైయ్యాడని చెబుతున్నారు.
‘బాబు’ ముందరి కాళ్లకు బంధం వేస్తున్న ఏపీ బీజేపి