ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైయ్యారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపీ తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడనున్నారనీ, జనసేన పార్టీలో చేరనున్నారనీ గతంలో ప్రచారం జరిగింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ .. కన్నా నివాసానికి వెళ్లి సమావేశం అయిన తర్వాత ఆ వార్తలు జోరందుకున్నాయి. అయితే అది మర్యాదపూరంగా జరిగిన భేటీ మాత్రమేననీ, రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. ఒక సారి ఆయన టీడీపీ చేరనున్నారనీ, మరొక సారి జనసేన లో చేరనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తరుణంలోనే బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు నేపథ్యంలో సోము వీర్రాజు వైఖరిని కన్నా తప్పుబట్టారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారనీ, అధ్యక్షుల మార్పు తనతో చర్చించలేదనీ, ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనని కన్నా పేర్కొన్నారు.

ఆ తర్వాత కూడా పార్టీలో సోము వీర్రాజు హవానే కొనసాగుతుండటం, పార్టీలో కన్నాకు, ఆయన వర్గానికి ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం లేకపోవడంతో ఇక పార్టీ మారాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇవేళ (గురువారం) ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఆయన నివాసంలోనే జరుగుతోంది. కన్నా పార్టీ మార్పు అంశంపై ఊహగానాలు వస్తున్న వేళ ముఖ్య అనుచరులతో సమవేశం ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తొంది. టీడీపీ లేదా జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఏ పార్టీలో చేరేది ఈ రోజు జరిగే సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కన్నా అనుచరులు పేర్కొంటున్నారు. ఇటీవల బీజేపీ కార్యక్రమాలకు కన్నా దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలోనూ కన్నా పాల్గొనలేదు. దీంతో కన్నా పార్టీ మార్పు ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు. పార్టీ మార్పు, ఏ పార్టీలో చేరనున్నారు అనేది ఈ రోజు సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

1989 నుండి 2004 వరకూ నాలుగు సార్లు గుంటూరు జిల్లా పెదకూరపాడు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ 2009 లో గుంటూరు పశ్చిమ నుండి అయిదవ సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నెదురుమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 అక్టోబర్ 27న న్యూఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరగా, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైయ్యారు. 2020 జూలైలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియమితులైన తర్వాత .. పార్టీలో కన్నా ప్రాధాన్యత తగ్గిపోయింది.
ఏపీ సీఎం జగన్ పనితీరు ప్రశంసించిన జేఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్