Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏసీబీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ లీగల్ టీం చంద్రబాబుకి బెయిల్ వచ్చే రీతిలో న్యాయస్థానాలలో పోరాటం చేస్తూ ఉంది. ఇక ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసులో మరింత దర్యాప్తు జరపాల్సి ఉందని ఇందులో భాగంగా చంద్రబాబుని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తెలియజేయగా.., కస్టడీకి ఇవ్వొద్దు అంటూ చంద్రబాబు న్యాయవాదులు వాదించారు.
అయితే ఇందుకు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు సీఐడీనీ ఆదేశించడం జరిగింది. సీఐడీ సమయం కోరగా హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 18లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ నెల 18 వరకు కస్టడీ పిటిషన్ పై ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. అనంతరం ఈ నెల 19కి తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది. దీంతో హైకోర్టులో చంద్రబాబుకి ఊరట కలిగింది. వచ్చే సోమవారం వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీనీ ఆదేశించడం జరిగింది. దీంతో ఈ నెల 18 వరకు చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లోనే ఉండనున్నారు.
మరొక పక్క ఈ కేసులో చంద్రబాబు రిమాండ్ లో ఉండటంతో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరుపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నీ కొట్టేయాలని ఆయన తరుపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్రా కోర్టును కోరారు. మాజీ ముఖ్యమంత్రి కావటంతో చంద్రబాబుని అరెస్టు చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి సీఐడీ తీసుకోలేదని తెలిపారు. అయితే చంద్రబాబు విచారణ ప్రాథమిక దశలో ఉండటంతో బెయిల్ ఇవ్వద్దని ఏఏజీ పొన్నవోలు కోర్టును కోరారు. ఈ క్రమంలో కేసులో కౌంటర్ దాఖలు చేయాలని..సీఐడీనీ హైకోర్ట్ ఆదేశించింది. అంతేకాకుండా ఇరువైపులా వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని ఈ నెల 19కు వాయిదా వేయడం జరిగింది.