TDP: సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులైన సంగతి తెలిసిందే. కన్నాను నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమిస్తూ నిన్న పార్టీ అధ్యక్షుడు కింజారాపు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేసారు. అయితే ఈ నియోజకవర్గం నుండి టీడీపీ ఇన్ చార్జి స్థానానికి దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరో నేత ఆశిస్తున్నారు. ముగ్గురు నేతలు పార్టీ కోసం పోటాపోటీగా ఇటీవల కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరికీ కాకుండా అనూహ్యంగా పార్టీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో కోడెల శివరామ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుండి పోటీ చేస్తాననీ, తాను గెలిచి తీరతానని దీమా వ్యక్తం చేశారు.

పార్టీ నాయకత్వంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన తన తండ్రి కోసం మహానాడులో అయిదు నిమిషాలు కేటాయించకపోవడం బాధ కల్గించిందని అన్నారు. పదవులు వస్తాయంటే ఒక పార్టీ, పదవులు ఇస్తామంటే మరో పార్టీ ఇలా మూడు పార్టీలు మారిన కన్నా లక్ష్మీనారాయణ కు తన తండ్రికి పోలికేంటని ప్రశ్నించారు కోడెల శివరామ్. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో రాజకీయం కోడెల వర్సెస్ కన్నా అన్నట్లుగా సాగిందని అప్పట్లో ఇదే కన్నా టీడీపీ కార్యకర్తలను వేధిస్తుంటే వారికి అండగా నిలబడిన వ్యక్తి తన తండ్రి కోడెల శివప్రసాదరావు అని తెలిపారు శివరామ్. తొలి నుండి నమ్మకంగా పార్టీ కోసం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఫరవాలేదూ కానీ అవమాచించడం మాత్రం తప్పు అని అన్నారు. అవమానాలు, కష్టాలు తమ జీవితంలో భాగమైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన తల్లిని కూడా అవమానించారని అన్నారు. చంద్రబాబును కలిసి కనీసం అయిదు నిమిషాల పాటు తమ ఇబ్బందులను వివరించాలని మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామనీ, కానీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కోడెల ఆత్మీయుల కోసం భవిష్యత్తులోనూ తాను నిలబడతానని స్పష్టం చేశారు. కోడెల అభిమానుల నిర్ణయం ప్రకారమే తానూ నడుచుకుంటానని తెలిపారు. ఇతర పార్టీల నుండి ఆఫర్లు అన్న ప్రచారం కేవలం పుకార్లు మాత్రమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలిచి తన తండ్రి రుణం తీర్చుకుంటానని శివరామ్ స్పష్టం చేశారు. చంద్రబాబు పిలిచి మాట్లాడతారని ఇప్పటికీ తాను ఎదురుచూస్తున్నానని శివరామ్ తెలిపారు. శివరామ్ ప్రకటన చూస్తుంటే ఒక వేళ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేయకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా బరిలో దిగడానికి స్పష్టం చేసినట్లుగా ఉంది. మరో పక్క కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి టీడీపీలో గ్రూపులు అంటూ ఏమీ లేవని అన్నారు. జీవీ ఆంజనేయులు తదితరులతో తాను వ్యక్తిగతంగా మాట్లాడాననీ, కోడెల శివరామ్ తో పార్టీ పెద్దలు మాట్లాడతారని చెప్పారు. తాను సత్తెనపల్లి నుండి గెలిచి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ.
Crime News: ఏపి, తెలంగాణలో ఇద్దరు రౌడీ షీటర్ల దారుణ హత్య