New Medicine: కరోనా బాధితులకు సంజీవనిగా పని చేస్తున్న కృష్ణపట్నం అనందయ్య ఆయుర్వేద మందు కోసం శుక్రవారం జనాలు పొటెత్తారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నేడు జనసంద్రమైంది. జనాలను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. దీంతో లాఠీ చార్జి కూడా చేయాల్సి వచ్చింది. గత నెల రోజులకుపైగా అనందయ్య కరోనా రోగులకు ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 17న లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదు లేకున్నా ఆయుర్వేద మందు పంపిణీని అధికారులు నిలుపుదల చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి నేటి నుండి అనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని ప్రకటించారు. నేటి నుండి మందు పంపిణీ జరుగుతుందని తెలియడంతో వివిధ ప్రాంతాల నుండి కరోనా బాధితులు కృష్ణపట్నం బాట పట్టారు. బారికేడ్లు ఏర్పాటు ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు.

ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి శుక్రవారం అనందయ్యతో కలిసి జనాలకు మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో జనాలు మందు కోసం తోసుకురావడంతో గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ప్రజలను అదుపుచేసేందుకు లాఠీ చార్జి చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు కొద్ది మంది మాత్రమే పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తరువాత మందు పంపిణీ తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. అప్పటి వరకూ పంపిణీ నిలిపివేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఒక్క రోజు మాత్రమే మందు పంపిణీ చేసి నిలుపుదల చేయడంపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.