ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈ నెల 30 (రేపు) వ తేదీ పదవీ విరమణ చేయనున్నారు. 1990 బ్యాచ్ కి చెందిన జవహర్ రెడ్డి డిసెంబర్ 1 నుండి కొత్త సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 జూన్ వరకూ సుమారు సంవత్సరన్నర కాలం పాటు ఆయన సీఎస్ గా సేవలు అందించనున్నారు.

జవహర్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, టీటీడీ ఈఓగా, అంతకు ముందు పలు కీలక శాఖల్లోనూ పని చేశారు. కాగా సీఎస్ గా పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మ ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా నియమించనున్నట్లు సమాచారం. దాంతో పాటు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్ ఎక్స్ లెన్స్ అండ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ పోస్టులోనూ ఇన్ చార్జిగా నియమించనున్నట్లు తెలుస్తొంది.
మరో పక్క సీఎస్ గా జవహర్ రెడ్డి నియమితులు అయిన రోజే రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎస్ రేసులో సీనియర్ జాబితాలో ఉన్న పూనం మాలకొండయ్య ను సీఎం జగన్ స్పెషల్ సీఎస్ గాృ, మదుసూధనరెడ్డిని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా, పాఠశాల విద్యాశాక ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మహ్మద్ దివాన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బుడితి రాజశేఖర్ ను జీఏడిలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.