Bhuma Akhila Priya: టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి భూమ అఖిలప్రియకు కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న సమయంలో ఈ నెల 16న ఏవి సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ వర్గీయులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలు అయ్యాయి.

దీంతో ఏవి సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ తదితరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 17వ తేదీన అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఆమెతో సహా ఇతర నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. భూమా అఖిలప్రియకు ఏడు నెలల బాలుడు ఉన్నాడనీ, అందుచేత బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు నంద్యాల కోర్టులో తొలుత పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో మళ్లీ కర్నూలు కోర్టులో న్యాయవాదులు పిటిషన్ వేశారు.
దీనిపై న్యాయస్థానం విచారణ జరిపి అమెకు బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు పోలీసులు కూడా భూమా అఖిలప్రియను కస్టడీ తీసుకునేందుకు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కాగా, భూమా అఖిలప్రియ అరెస్టు అయి జైలులో ఉండటంతో ఆళ్లగడ్డలో ఇన్ చార్జి లేకుండానే లోకేష్ పాదయాత్ర పూర్తి చేశారు. లోకేష్ పాదయాత్ర ఆళ్లగడ్డ లో ముగిసి కడప జిల్లాలో అడుగు పెట్టిన తర్వాత రోజే ఆమెకు బెయిల్ లభించింది.
Road Accident: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం