వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీ చరిత్ర సృష్టించే ఫలితాలతో ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
సీఎం అయిన నాటి నుంచి ఎన్నికల హామీలను నిలుపుకొనేందుకు వైఎస్ జగన్ కృషి చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజల హృదయాల్లో నిలిచే పనులు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఆయన సొంత మనుషులే చేస్తున్న పనులతో సీఎం గ్రాఫ్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయని పలువురు అంటున్నారు.
ఆ రెండు చోట్లా .. ఏం జరుగుతోంది
సీఎం జగన్ సొంత జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగులో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల మధ్య ఉద్రిక్త రాజకీయాలు నడిచేవి. అయితే ఈ ఇద్దరు మాజీ మంత్రులు మారిన రాజకీయ పరిణామాలతో ఎవరు దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య పంచాయితీ నడుస్తోందని సమాచారం. ఈ ఇద్దరితో పాటుగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అనే ఇంకో గ్రూప్ కూడా ఉందట. ఈ ట్రయాంగిల్ ఆధిపత్యపోరుపై గతంలో పార్టీ పెద్దల దగ్గర పలు పంచాయితీలు జరిగాయి. కానీ ఎప్పటికప్పుడు సమస్యలు సమసినట్టు కనిపించినా అవి తాజాగానే ఉంటున్నాయి. దీంతో జమ్మలముడుగు నియోజకవర్గం నేతలు తమ పార్టీలో ఏం జరుగుతోందనే ఆందోళనలు ఉన్నట్లు సమాచారం.
గన్నవరం లో గరంగరం
ఎన్నికల ఫలితాలు వెలువడిన ఏడాది కాలంలో గన్నవరం వైసీపీ రాజకీయాలు అనేక రకాలుగా టర్న్ తీసుకున్నాయి. గన్నవరం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికార వైసీపీకి జైకొట్టిన నాటి నుంచి స్థానిక రాజకీయాలు వాడివేడిగా ఉంటున్నాయి. ఎమ్మెల్యే వంశీ ఒక వర్గమైతే.. ఆయన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులది మరో వర్గం. వీరిద్దరూ గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి.. వంశీ చేతిలో ఓడినవారే కావడంతో రాజకీయం రంజుగా మారింది. ఈ వివాదాలను సద్దుమణిగించేందుకు స్వయంగా సీఎం జగన్ చేతుల్ని కలిపినా.. చేతలు కలవడం లేదు. రోజుకో పంచాయితీ పార్టీ పెద్దల దగ్గరకు వెళ్తూనే ఉంటుంది. నేతల మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు పలుమార్లు ప్రయత్నించినా.. అవి సఫలం కాలేదని సమాచారం . ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగకపోతే రెండు కీలక జిల్లాల్లో వివాదాలు ముదిరిపోతాయని అంటున్నారు.