ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ కొనసాగుతోంది. ముందుగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 9 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనున్నది. 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాన్ని వెల్లడించనున్నారు.

శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా ఇందులో వైసీపీకి 151 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే చాలా కాలంగా నలుగురు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యే వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి నైతికంగా అసెంబ్లీలో 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నా అభ్యర్ధిని బరిలోకి దింపింది. ఎడు ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది పోటీ పడుతుండటంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రానున్నారు.
పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుండి అసెంబ్లీకి బయలుదేరతారు, 11 గంటలకు చంద్రబాబు అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని గతంలో చంద్రబాబు శపథం చేసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత మరల అసెంబ్లీకి రాలేదు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు అసెంబ్లీకి వస్తుండటంతో టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. చంద్రబాబు నివాసం నుంచే అసెంబ్లీకి అందరూ బయలుదేరి రానున్నారు. మరో పక్క ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైయ్యాయి. ప్రశ్నోత్తరాల అనంతరం పలు బిల్లులు, పలు శాఖల డిమాండ్లను సభ్యులు ఆమోదం తెలపనున్నారు. తదుపరి పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనున్నది.
విశాఖలో విషాదం .. ముగ్గురు మృతి