నెల్లూరు రూరల్ వైసీపీలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. వైసీపీ రెబల్ గా మారిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిత్యం మీడియా ముందుకు వచ్చి వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కోటంరెడ్డి చేస్తున్న విమర్శలపై ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ లు ఇస్తున్నారు. దీంతో నేతల విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం కొనసాగుతోంది. తాజాగా గురువారం కోటంరెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ వైసీపీ నుండి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందనీ, దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళతానని అన్నారు.

ఆదాలను ఢీకొట్టడానికి సిద్దం
నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి అని చెబుతున్నారనీ, ఆదాల ఏ పార్టీలో ఉంటున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు కోటంరెడ్డి. గతంలో మాదిరిగా అన్ని పార్టీలకు ఆదాల తిరగొద్దని సూచించారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న ప్రభాకరరెడ్డి తో ఢీకొనడానికి తాను సిద్దమని తెలిపారు. తాను ఎవరినీ శత్రువుగా భావించననీ, పోటీదారుగానే భావిస్తానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై హోంశాఖకు ఫిర్యాదు చేసినట్లేనని, వైసీపీ ప్రభుత్వం కూడా విచారణ కోరాలని డిమాండ్ చేశారు. మేయర్ సహా 11 మంది కార్పోరేటర్ లు తన వెంట ఉన్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. పార్టీ వైపు వెళ్లిన వారు రాజకీయంగానే కాదు మానసికంగానూ తనకు దగ్గరగా ఉన్నారని అంటూ ఆరు నెలల తర్వాత చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తారని పేర్కొన్నారు.
కోటంరెడ్డి జాతకం మొత్తం త్వరలో బయటకు
మరో పక్క ఆదాల ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ .. ప్రతి రోజు శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశాల్ల పచ్చి డ్రామాలు వేస్తున్నారని విమర్శించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఈనాటి వరకూ తాను ఎలాంటి మచ్చలేకుండా రాజకీయాలు చేశానని ఆదాల పేర్కొన్నారు. ఈ మూడున్నరేళ్లలో కోటంరెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడో అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. కోటంరెడ్డికి పార్టీ, కార్యకర్తలు అవసరం లేదనీ, ఆయనకు డబ్బు మీదే ప్రేమ ఎక్కువ అని అందుకే ఎలాంటి పని చేయడానికి సిద్దపడతాడని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి జాతకం మొత్తం త్వరలో బయటకు వస్తుందని చెప్పారు. కొద్ది రోజుల్లోనే ప్రజలకు శ్రీధర్ రెడ్డి గురించి అన్ని విషయాలు చెబుతామన్నారు. ప్రజలను, రియల్టర్లను, వ్యాపారులను కోటంరెడ్డి ఎలా బెదిరించారో అందరికీ తెలుసునని ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని ఆదాల హెచ్చరించారు.
ఫోన్ ట్రాప్ కాదు చంద్రబాబు ట్రాప్
మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవని అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి చెప్పింది అబద్దమని ఆయన స్నేహితుడు శివారెడ్డే చెబుతున్నాడన్నారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్ అని చెబుతున్నాడని అన్నారు. జరిగింది ఫోన్ ట్రాప్ కాదనీ, చంద్రబాబు ట్రాప్ అని, శ్రీధర్ రెడ్డి అబద్దాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని విమర్శించారు. అండగా నిలిచిన పార్టీకి కోటంరెడ్డి ద్రోహం చేశారనీ, అందుకే ఆయనకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయని అన్నారు. ప్రజలు అందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెంటే ఉన్నారని కాకాణి పేర్కొన్నారు.
Breaking: అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర విషాదం .. ఏడుగురు కార్మికులు దుర్మరణం