ఉదయగిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చుని వైసీపీ శ్రేణులకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సవాల్ విసిరారు. ఉదయగిరి వస్తే తరిమికొడతామంటూ ఆయనకు వైసీపీ నేతలు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఆయన తన అనుచరులతో బస్టాండ్ వద్దకు వచ్చారు. అక్కడ కుర్చీ వేయించుకుని కూర్చున్నారు. తనను తరిమి కొడతానన్న వాళ్లు రావాలంటూ సవాల్ చేశారు. ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ఆయన మద్దతు దారులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంతో మేకపాటిని వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వైసీపీ వర్గీయులు ఆయనను టార్గెట్ చేస్తూ ఉదయగిరి వస్తే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. ఇవేళ ఉదయం కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం నుండి వెళ్లిపో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేసారు. ఈ విషయం తెలుసుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మర్రిపాడు నుండి ఉదయగిరి చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనపై అభాండాలు వేసి పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రజల అండతోనే ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని పేర్కొన్న ఆయన.. తనను తరిమికొడతానన్న వారు ఎవరొస్తారో రావాలని సవాల్ విసిరారు.
నా సీటును అమ్ముకున్నారంటూ మేకపాటి సంచలన కామెంట్స్