మైలవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ పోరు ఇటీవల తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి వచ్చింది. మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన సొంత ప్రాంతం మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం కావడం కావడం, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనకు ఇక్కడ బలమైన వర్గం ఉంది. 2019 ఎన్నికల్లో జోగి రమేష్ ను పెడనకు పంపించిన వైసీపీ ఇక్కడ నుండి వసంత కృష్ణ ప్రసాద్ ను పోటీకి నిలిపింది. పెడనలో జోగి రమేష్, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ లు గెలిచారు. తొలి నాళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా తర్వాత జోగి రమేష్ వర్గీయులకు, వసంత వర్గీయులకు మధ్య తేడాలు వచ్చాయి. మైలవరం నియోజకవర్గ విషయంలో మంత్రి హోదాలో జోగి రమేష్ కల్పించుకోవడంతో వసంత కృష్ణ ప్రసాద్ మనస్థాపానికి గురైయ్యారు. వీరి మధ్య నెలకొన్న వివాదాల వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు చేరిన విషయం తెలిసిందే.

వారి మధ్య గత కొంత కాలంగా ఉన్న విభేదాలు సోషల్ మీడియాలో పరస్పరం వ్యతిరేకంగా ప్రచారం చేయించుకునే వరకూ వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొద్ది రోజుల నుండి నిర్వహించకుండా సైలెంట్ అయిపోయారు వసంత కృష్ణ ప్రసాద్. ఈ వ్యవహారం పరిష్కరించే క్రమంలో భాగంగా సీఎం జగన్మోహనరెడ్డి రీసెంట్ గా జరిగిన కేబినెట్ భేటీ తర్వాత జోగి రమేష్ తో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది. పక్క నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దని, ఎవరి నియోజకవర్గాల్లో వారు కార్యక్రమాలను నిర్వహించుకోవాలని గట్టిగా చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వసంత కృష్ణప్రసాద్ ను తాడేపల్లికి పిలిపించుకుని జగన్ మాట్లాడారు. వారి మధ్య సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో మైలవరం లో జరుగుతున్న వ్యవహారాలపై అంశాల వారీగా చర్చ జరిగినట్లు తెలిసింది. సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇస్తూ గో హెడ్ అనడంతో మైలవరం నియోజకవర్గ విభేదాలు, వివాదాలకు తెరపడినట్లు అయ్యింది.

వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడిన దాని బట్టి చూస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది. తాను ఎవరి నియోజకవర్గంలోనూ జోక్యం చేసుకోననీ, తన నియోజకవర్గంలో ఎవరైనా కలుగజేసుకుంటే మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్. విబేధాలకు సంబంధించిన విషయాలు తమ వరకు రాకముందే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేయడం సరికాదని, ఇకపై ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జగన్ తనకు సూచించారని కృష్ణప్రసాద్ తెలిపారు. గతంలో ముగ్గురు మంత్రులతో పని చేస్తే ఎప్పుడూ వారితో విభేదాలు రాలేదనీ, తన నియోజకవర్గంలో జోగి రమేష్ వేలు పెట్టడంతోనే సమస్య వచ్చిందని కేపి వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మార్చి 10కి వాయిదా.. నిందితులు చంచల్‌గూడ జైలుకి తరలింపు