నెల్లురు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు వావుటా ఎగురవేసిన ప్రభుత్వంపై తీవ్ర స్థాయి ఆరోపణలు నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు ఇంత అవమానాలను భరిస్తూ కొనసాగలేననీ, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనంటూ కోటంరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై పలువురు మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నేతలతో చర్చలు జరిపారు.

చిన్న పామునైనా పెద్ద పెద్దకర్రతో కొట్టాలన్న సామెతను అనుసరించి, నెల్లురు రూరల్ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని ఢీకొనాలంటే బలవంతుడైన అభ్యర్ధే కావాలని భావించిన వైసీపీ అధిష్టానం ఆ దిశగా చర్యలు చేపట్టింది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డికి అప్పగించారు. ఈ విషయాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి ఆదాల పోటీ చేస్తారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ రూరల్ ఇన్ చార్జిగా తనను నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇకపై నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరుగుతాయని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలి సారిగా వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి నాడు అధికార టీడీపీలో చేరినా వైఎస్ఆర్ కుటుంబానికి స్ట్రాంగ్ ఫాలోయర్ గా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తరుపున విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆయన మంత్రి పదవిని ఆశించారు. కానీ నెల్లూరు జిల్లా నుండి మొదటి దఫా అనిల్ కుమార్ యాదవ్ కు, ఆ తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డికి అవకాశం లభించింది. మరో పక్క అధికార పక్ష ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై రోడ్డు ఎక్కి ఆందోళనలు చేశారు. అలానే నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతూ సొంత ఇమేజే పెంచుకునే ప్రయత్నం చేశారు. కొంత కాలంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా లోలోన అసంతృప్తిగా ఉన్నప్పటికీ బహిర్గతం కాలేదు. తాజాగా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

ఇక నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకరరెడ్డి విషయానికి వస్తే ఆయన వ్యాపార వేత్త, సీనియర్ రాజకీయ నాయకుడు. 1999 ఎన్నికల్లో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 1999 నుండి 2000 వరకూ టీడీపీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున సర్వేపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై విజయం సాధించారు. అనంతరం 2009 ఎన్నికల్లోనూ సోమిరెడ్డిపై రెండో సారి విజయం సాధించారు ఆదాల. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి దూరమై టీడీపీకి దగ్గర అయ్యారు.

2019 సార్వత్రిక ఎన్నకల సమయంలో నెల్లూరు రూరల్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధిత్వం ఖరారు అయిన తర్వాత మూడు రోజులకే ఆదాల ఆ పార్టీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరారు. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఆదాల ఓటమి ఎరుగని నాయకుడుగా ఉన్నారు. ఒక సారి టీడీపీ తరుపున, రెండు పర్యయాలు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆదాల ప్రభాకరరెడ్డి, 2019 లో నెల్లూరు లోక్ సభకు వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. ఇది ఆదాల ట్రాక్ రికార్డు. అందుకే రెండు సార్లు విజయం సాధించి, ప్రజల్లో మాస్ ఇమేజ్ కల్గి ఉన్న కోటంరెడ్డి ని పరాజయం పాలు చేసేందుకు ఆదాలను రంగంలోకి దింపింది వైసీపీ.