YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొందున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ విచారణకు కూడా డుమ్మా కొట్టి మరో సారి ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 16వ తేదీ విచారణకు హజరుకావాల్సి ఉండగా చివరి నిమిషంలో తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల హజరుకావడం లేదంటూ సీబీఐకి సమాచారం ఇచ్చి హైదరాబాద్ నుండి పులివెందుల వెళ్లిపోయారు అవినాష్ రెడ్డి. విచారణకు హజరయ్యేందుకు మూడు నాలుగు రోజులు సమయం కావాలని సీబీఐని కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీబీఐ .. 19వ తేదీ విచారణకు హజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.

అయితే ఆ మరుసటి రోజే అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు నుండి ఉపశమన ఆదేశాలు రాలేదు. దీంతో ఇవేళ విచారణపై చివరి నిమిషం వరకూ ఉత్కంఠ కొనసాగింది. ఈ వేళ ఉదయం సీబీఐ అధికారులకు విచారణ హజరు అవుతున్నట్లు సమాచారం ఇచ్చిన అవినాష్ రెడ్డి.. చివరి నిమిషంలో తన తల్లి ఆరోగ్యం బాగాలేదనీ, పులివెందులకు హుటాహుటిన వెళుతున్నట్లు సమాచారం ఇచ్చారు. అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో కోటి సీబీఐ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మరో పక్క అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి రాకుండా పులివెందులకు వెళుతున్న విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు రెండు బృందాలుగా ఆయనను అనుసరిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. తాజాగా అవినాష్ రెడ్డి రాసిన లేఖపై సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని ఇప్పటికే సీబీఐ కోర్టుకు తెలిపినందున ఈవేళ విచారణకు హజరయితే విచారణ పూర్తి అయిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆయన తండ్రి భాస్కరరెడ్డి, ఆయన సన్నిహితులను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.