కర్నూలులో సీబీఐ అధికారులకు చుక్కెదురైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవేళ విచారణకు హజరు కాలేనని, తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, వారం రోజులు సమయం కావాలంటూ నిన్న లేఖ రాశారు. ఈ లేఖపై స్పందన తెలియజేయని సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. ఒక వేళ సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని వార్తలు వినబడుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అనుచరులు కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి ముందు భైటాయించారు. ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఒక వేళ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే శాంతి భద్రతల సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

ఈ తరుణంలోనే అవినాష్ రెడ్డి మరో లేఖ రాశారు. తన తల్లి అనారోగ్య సమస్యను వివరించడంతో పాటు తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణలో ఉందని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ తర్వాత విచారణకు హజరు అవుతానని తెలిపారు. అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగానే ఉన్నట్లు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వైద్యులు ఇచ్చిన హెల్త్ బులిటెన్ రిపోర్టును సీబీఐకి పంపారు అవినాష్ రెడ్డి. ఇవాల్టి విచారణకు సైతం అవినాష్ రెడ్డి గైర్హజరు అవ్వడంతో వారంలో మొత్తం మడు సార్లు విచారణకు డుమ్మా కొట్టినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎమ్మంటున్నారంటే..?